మారుతున్న ప్రేక్షకుల నాడి.. రెండేళ్లకోసారి కొత్త ట్రెండ్
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:53 PM
ప్రతి రెండేళ్లకోసారి ప్రేక్ష కుల అభిరుచి మారిపోతోందని, ఒకప్పుడు ఆదరించిన రొటీన్ కథలను ఇప్పుడు నిర్మొహమాటంగా పక్కనపెడుతున్నారని బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ వర్తమాన ట్రెండ్‌ను విశ్లేషించారు.
ఒకప్పుడు దశాబ్దాల పాటు ఒకే ఫార్మాట్‌లో సినిమాలు నడిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రతి రెండేళ్లకోసారి ప్రేక్ష కుల అభిరుచి మారిపోతోందని, ఒకప్పుడు ఆదరించిన రొటీన్ కథలను ఇప్పుడు నిర్మొహమాటంగా పక్కనపెడుతున్నారని బాలీవుడ్ (Bollywood) స్టార్ అక్షయ్‌కుమార్ (Akshay Kumar) వర్తమాన ట్రెండ్‌ను విశ్లేషించారు. ‘ధురంధర్’ (Dhurandhar) సినిమా విజయంతో తనకు ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అక్షయ్ చెప్పినట్లు గత దశాబ్దకాలంలో బారతీయ సినిమా మేకింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు చాలా వేగంగా చోటు చేసుకున్నాయి.
సినిమా అనేది ఎప్పటికప్పుడు రంగులు మార్చుకునే ఒక అద్భుత ప్రపంచం. ఒకప్పటి హిట్ ఫార్ములా ఇప్పుడు ఫ్లాప్ అవ్వచ్చు. ఇప్పుడు ఆదరణ దక్కని కాన్సెప్ట్ భవిష్యత్తులో బ్లాక్‌బస్టర్ కావొచ్చు. ఇదంతా ప్రేక్షకుల మారుతున్న అభిరుచి, మల్టీప్లెక్స్, ఓటీటీల పుణ్యమా అని పెరిగిన అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అక్షయ్‌కుమార్ చెప్పినట్లుగా ప్రేక్షకాభిరుచి చాలా వేగంగా మారిపోతోంది.
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్ అరచేతిలోకి వచ్చేసింది. హాలీవుడ్, కొరియన్, యూరోపియన్ సినిమాలు సులభంగా అందుబాటులో ఉండడంతో...రెండేళ్ల క్రితం కొత్తగా అనిపించిన మేకింగ్ స్టైల్ లేదా కథనం ఇప్పుడు పాత బడిపోతోంది. ప్రేక్షకుడికి తదుపరి సన్నివేశం ఏమిటో ఊహించేంత పరిణతి వచ్చేసింది. అందుకే మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పరిగెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పట్లో ఆ సినిమాలు.. ఇప్పుడు
గతంలో హీరో పరిచయ సన్నివేశం, మూడు ఫైట్లు, ఆరు పాటలు, మధ్యలో కాస్త కామెడీ సన్నివేశాలు, చివర్లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటే సినిమా సూపర్‌హిట్. కుటుంబ కథా చిత్రాలు, సాధారణ రొమాంటిక్ కామెడీలు సైతం నెలల తరబడి థియేటర్లలో ఆడేవి. కానీ ఇప్పుడు ఆ ఫార్ములా పనిచేయడం లేదు. ‘ధురంధర్’ లాంటి సినిమాలతో అర్థమయ్యేది ఏమిటంటే, ప్రేక్షకులు ఇప్పుడు రఫ్ అండ్ రస్టిక్ మూవీస్, హై - వోల్టేజ్ యాక్షన్, డార్క్ థ్రిల్లర్స్, మైండ్ బెండింగ్ కాన్సె్‌ప్టలను ఆదరిస్తున్నారు. హీరోలో గ్రే షేడ్స్ ఉన్నా, కథలో వాస్తవికత, ఎమోషన్ బలంగా ఉంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

మారిన పంథా
గడిచిన పదేళ్లలో భారతీయ సినిమా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్... భాషా సరిహద్దులను చెరిపివేసింది. ‘కేజీఎఫ్, పుష్ప, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి చిత్రాలు ఒక ప్రాంతీయ కథను గ్లోబల్ స్థాయిలో చెప్పవచ్చని నిరూపించాయి. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు, భారీ విజువల్స్ ఉన్న సినిమాలకు విపరీతమైన ఆదరణ దక్కింది.
నడుస్తున్న ట్రెండ్
ప్రస్తుతం సినిమా అంటే కేవలం వినోదం కాదు, అదొక ఎక్స్‌పీరియన్స్. థియేటర్‌కు వచ్చి వందల రూపాయలు ఖర్చు చేయాలంటే, ఆ సినిమా.. ఇంట్లో టీవీలో, లేదా మొబైల్‌లో చూసేదానికంటే అద్భుతంగా ఉండాలి. అందుకే ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాలోని క్యారెక్టర్లు మరో సినిమాలో కనిపించడం, యాక్షన్ కొరియోగ్రఫీలో హాలీవుడ్ స్థాయిని దాటిపోవడం, మితిమీరిన హింస ఉన్నప్పటికీ అందులో బలమైన ఎమోషన్ ముడిపడి ఉండడం వర్తమాన ట్రెండ్.
కొత్తదనానిదే భవిష్యత్తు
రాబోయే రోజుల్లో ప్రేక్షకుల అభిరుచి మరింత అడ్వాన్స్‌గా మారబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక వీఎ్‌ఫఎక్స్ సాంకేతికతతో మనం ఊహించని విజువల్ వండర్స్ తెరపైకి రాబోతున్నాయి. ప్రేక్షకులు మమేకమయ్యే కథనం, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (వాస్తవ ప్రపంచానికి కంప్యూటర్ సృష్టించిన గ్రాఫిక్స్, సౌండ్, యానిమేషన్లను జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇవ్వడం) అనుభూతులు థియేటర్లలో భాగం కావొచ్చు. హాలీవుడ్ స్టూడియోల తర హాలో దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు కలసి నటించే బారీ మల్టీస్టారర్లు, క్రాస్ ఓవర్ ప్రాజెక్టులు (వేర్వేరు ఫ్రాంఛైజీల కలయికతో రూపొందే చిత్రాలు) భవిష్యత్తు బాక్సాఫీసును శాసించబోతున్నాయి. రొటీన్‌కు స్వస్తి పలికి, కంటెంట్, మేకింగ్‌లో ఎవరైతే కొత్తపుంతలు తొక్కుతారో భవిష్యత్తు వారిదే.