Naveen Polishetty: నా ప్రతి సినిమాని.. ప్రేక్షకులే మార్కెటింగ్‌ చేస్తుంటారు

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:32 AM

నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ఈనెల 14న విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు.

Naveen Polishetty

‘నా ప్రతి సినిమాని ప్రేక్షకులే మార్కెటింగ్‌ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన విజయాలు.. నాలో ఎంతో శక్తిని నింపాయి. ఆ శక్తితోనే రెట్టింపు వినోదాన్ని అందించాలనే ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) కథ రాశాను’ అని అన్నారు హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty).

ఆయన కథానాయకుడుగా నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రమిది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఈనెల 14న విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ‘ఆంధ్ర టు తెలంగాణ’ అంటూ సాగే పాటను ఈ వేడుకలో ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గీతాన్ని చంద్రబోస్‌ రాయగా, మిక్కీ జె మేయర్‌ సంగీంతం అందించారు.

కార్యక్రమంలో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ ‘మీరు ఏ నమ్మకంతో అయితే నా గత చిత్రాలను సూపర్‌ హిట్‌ చేశారో.. అదే నమ్మకంతో ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు టికెట్లు బుక్‌ చేసుకోండి. కుటుంబంతో, స్నేహితులతో వచ్చి రచ్చ రచ్చ చేయండి. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాది’ అని అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నేను పోషించిన ‘చారులత’ పాత్రపై ప్రేమను కురిపిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు మారి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశంలో జోక్స్‌ పేలుతూ ఉంటాయి. మీ కుటుంబంతో కలసి హాయిగా నవ్వుకోవచ్చు’ అని అన్నారు. ‘ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముంది’ అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 06:32 AM