Epic: శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు!
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:41 PM
'ఎపిక్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. నెటిజన్స్ చాలామంది సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమకు శేఖర్ కమ్ముల హీరోలంటేనే ఇష్టమని తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి ఆయన చేసే కాంట్రవర్షియల్ కామెంట్స్ కారణమని అప్పట్లో జనాలు తెగ చెవులు కొరుక్కున్నారు. తమ చిత్రం విడుదలయ్యే వరకూ ఎలాంటి కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలూ ఇవ్వకూడదని, వివాదాల జోలుకు వెళ్ళకూడదని ప్రకాశ్ రాజ్ కు 'స్పిరిట్' మేకర్స్ నిబంధన విధించారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హల్చల్ చేసింది. అయితే నిజం చెప్పాలంటే... ఒక్కోసారి సందీప్ రెడ్డి వంగా ఇచ్చే స్టేట్ మెంట్సే ఎక్కువ వైరల్ అవుతుంటాయి, వివాదాలకు కారణమౌతాయి. తాజాగా 'ఎపిక్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తోటి దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఎపిక్' సినిమా ట్రైలర్‌లో 'శేఖర్ కమ్ముల లాంటి హీరో, సందీప్ రెడ్డి వంగా హీరోలాంటి హీరోయిన్' అనే డైలాగ్ ఒకటి ఉంది. దీని గురించి తన అభిప్రాయం చెప్పమని వ్యాఖ్యాత సుమ సందీప్ రెడ్డి వంగాను అడిగినప్పుడు ఆయన నిర్మొహమాటంగా... 'తనకు శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలు నచ్చర'ని చెప్పేశాడు. అవాక్కవడం సుమ వంతైంది. అయితే సందీప్ రెడ్డి తడుముకోకుండా.... 'నిజమే ఆయన సినిమాల్లో హీరోలు నాకు నచ్చరు. అయితే నా సినిమాల్లోని హీరోలాంటి హీరోయిన్ అని చెప్పడం బాగుంది. ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది' అని అన్నారు.
సందీప్ రెడ్డి వంగా ఇలా కామెంట్ చేశాడో లేదో... అలా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం మొదలైంది. అత్యధిక శాతం మంది నెటిజన్స్... సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యలను తప్పు పట్టారు. శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలే డౌట్ టు ఎర్త్ ఉంటారని, వారి భావాలు ఉన్నతంగా ఉంటాయని, అమ్మాయిలను గౌరవిస్తారని అది సందీప్ కు నచ్చినట్టు లేదని కామెంట్ చేశారు. అదే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లోని హీరోలైతే ఆటిడ్యూడ్‌తో ఉంటారని, మహిళలను అస్సలు గౌరవించరని అందుకే బహుశా ఆయనకు తన హీరోలే ఇష్టమని వ్యాఖ్యానించారు. నెటిజన్స్ చాలామంది శేఖర్ కమ్ముల హీరోలే బెటర్ అని వ్యాఖ్యానించడం విశేషం. ఇంకొందరైతే... ఇలాంటి వివాదాస్పదమైన ప్రకటనలతో టైమ్ వేస్ట్ చేసుకోకుండా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీపై దృష్టిపెడితే బెటర్ అని కూడా అనేశారు!
ఇవి కూడా చదవండి:
Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!
Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు
గురు స్వాములు, మాల ధారులను అవమానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి