Vijay Rashmika: విజయ్, రష్మికల పెళ్లికి.. స్పెషల్ గిఫ్ట్
ABN , Publish Date - Jan 21 , 2026 | 07:18 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి సంబంధించి కొత్త విషయం హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ అగ్రతారలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ల వివాహానికి సంబంధించి కొత్త విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టార్ జంట పెళ్లి వేడుకను మరింత శోభాయమానంగా మార్చేందుకు 'ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' తమ వంతు కానుకను అందించనుంది. వీరి వివాహానికి ప్రత్యేకమైన డచ్ గులాబీలను పంపుతున్నట్లు కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీకాంత్ బొల్లేపల్లి తెలిపారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు వివాహ శుభాకాంక్షలు తె లియజేస్తున్నాం. వారి పెళ్లి వేడుకకు ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలను పంపిస్తున్నాం. ఈ పూలు వారి ఆనందకరమైన క్షణాలను మరింత అందంగా మారుస్తాయని ఆశిస్తున్నాం' అని శ్రీకాంత్ అన్నారు.
విజయ్ రష్మిక లాంటి సెలబ్రిటీల పెళ్లి అంటే డెకరేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు అత్యుత్తమ నాణ్యత కలిగిన డచ్ జాతి గులాబీలను ఎంపిక చేశారు. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా, వేడుకకు అంతర్జాతీయ స్థాయి లుక్‌ను, రాజసాన్ని తీసుకొస్తాయి. గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రహస్యంగా వీరి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నాలుగేళ్లుగా.. రూమర్స్
అయితే విజయ్ దేవరకొండతో తన వివాహం గురించి ఖండించకుండా, అలా అని దృవీకరించకుండా రష్మిక ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారి వివాహం గురించి జరుగుతున్న ఎడతెగని ప్రచారంపై హీరోయిన్ రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ. 'గత నాలుగేళ్లుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మేము దీనిపై స్పందిస్తాం. అప్పుడే అందరికీ నిజం తెలుస్తుంది' అని ఆమె వ్యాఖ్యానించారు.