'బైకర్'కు 'అంకుశం' సెంటిమెంట్...
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:11 PM
'బైకర్' మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డా. రాజశేఖర్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సత్కరించింది. కంటెంట్ నచ్చితే ఈ పాత్ర చేయడానికి అయినా తాను సిద్థమేనని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు.
యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ (Dr. Rajasekhar) నటించిన తాజా చిత్రం 'బైకర్' (Biker). ఈ నెల 3న విడుదలైన ఈ సినిమా రాజశేఖర్‌కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్. ఆ మధ్య నితిన్ (Nithin) మూవీలో రాజశేఖర్ ప్రత్యేక అతిథి పాత్రను పోషించినా... అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే 'బైకర్' నటుడిగా మరోసారి రాజశేఖర్‌ను గొప్పగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ రాజశేఖర్‌ను సత్కరించింది.
ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) మాట్లాడుతూ, 'రాజశేఖర్ గారికి ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఇన్‌స్పైర్ అయ్యే పాత్రలు రాక చేయడం లేదు. అదే విషయాన్ని ఆయన 'బైకర్' ప్రమోషన్స్ సమయంలో చెబితే... దానికి 'రాజశేఖర్‌గారు క్యారెక్టర్స్ అడుగుతున్నారు' అంటూ విపరీతార్థం తీశారు. ఆయనకు ఆఫర్స్ అనేకం వస్తున్నాయి. నచ్చిన పాత్రలు రావడం లేదు. అదే ఆయన చెప్పారు. ఇవాళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులను చూస్తుంటే మొత్తం ఫ్యామిలీని కలిసిన భావన కలుగుతోంది' అని చెప్పారు.
సత్కారం అనంతరం డా. రాజశేఖర్ మాట్లాడుతూ, 'ఏప్రిల్ 3న 'బైకర్' సినిమా రిలీజయింది. అప్పటి నుంచి నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. కానీ నా మనసులో ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. వేరే అవార్డులతో పోల్చితే ఇదే నాకు చాలా పెద్ద అవార్డు. 'అంకుశం' ముందు నాకు యాక్సిడెంట్ అయింది. 'అంకుశం' పెద్ద హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన 'మగాడు' సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అదే విధంగా ఇటీవల మళ్లీ నాకు యాక్సిడెంట్ అయింది. 'బైకర్' మంచి హిట్ అయింది. ఆ తరువాత వస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె. వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కోశాధికారి చదలవాడ భరద్వాజ, సభ్యులు ఎ. బాల్‌రెడ్డి, మోహన్ గోటేటి, 'ట్రేడ్‌గైడ్' వెంకటేశ్వరరావు, గిరిధర్, ఆర్.డి.ఎస్. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
