Zarina Wahab: చిరంజీవి తల్లి.. ప్రభాస్ నాన్నమ్మ.. ఎవరీ గంగమ్మ
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:36 PM
జరీనా వహాబ్ (Zarina Wahab).. ఈ పేరు తెలియడం తెలుగు ప్రేక్షకులకు కొంచెం కష్టం. సంక్రాంతి సినిమాలు చూసినవారికి అయితే ఆమెను వెంటనే గుర్తుపడతారు.
Zarina Wahab: జరీనా వహాబ్ (Zarina Wahab).. ఈ పేరు తెలియడం తెలుగు ప్రేక్షకులకు కొంచెం కష్టం. సంక్రాంతి సినిమాలు చూసినవారికి అయితే ఆమెను వెంటనే గుర్తుపడతారు. జరీనా ఎందుకు తెలియదు. మన రాజాసాబ్ నాన్నమ్మ గంగమ్మ కదా అని అనేస్తారు. ఇంకొంతమంది అయితే.. అరే.. ఆవిడ మన శంకర వరప్రసాద్ గారి తల్లి కదా అని చెప్పేస్తారు. అవును ఆమె.. జరీనా వహాబ్. తల్లి, బామ్మ పాత్రలకు టాలీవుడ్ ఫస్ట్ ఛాయిస్ గా ఆమె నిలిచింది.
చూడగానే తల్లి, బామ్మ భావన వచ్చేలా అనిపించే లుక్, ఆ హుందాతనం జరీనాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్ర చాలా కీలకం. బామ్మగా నవ్వించినా.. తల్లిగా ఏడిపించినా కూడా ఆమె పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. అసలు ఎవరీ జరీనా వహాబ్ అంటే.. అచ్చ తెలుగు నటి. ఆమె స్వస్థలం వైజాగ్. పూణేలో నటన నేర్చుకున్న జరీనా.. సినిమాల మీద ఆసక్తితో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించింది. ఆ సమయంలోనే స్టార్ హీరో రాజ్ కపూర్.. ఈమె సినిమాలకు పనికిరాదని అవమానించడంతో పట్టుబట్టి తన నటనకు మెరుగులు దిద్ది హీరోయిన్ గా మారింది. 1976లో విడుదలైన చిత్ చోర్ జరీనా లైఫ్ ని మార్చేసింది. ఈ సినిమా హిట్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు జరీనా. హిందీ సినిమాలలోనే కాక మళయాల, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.
తెలుగులో కృష్ణ సరసన గాజుల కిష్ణయ్య సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అమర ప్రేమ, హేమా హేమీలు లాంటి సినిమాలు చేసింది. ఎందుకో జరీనా తెలుగు మీద దృష్టి పెట్టలేదు.. హిందీ, మలయాళ సినిమాలకు అంకితమయ్యి అటే ఉండిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆదిత్య పంచోలీని వివాహామాడి కొన్నేళ్లు సినిమాలకు దూరమైంది.
ఇక రక్తచరిత్ర సినిమాతో జరీనాను మరోసారి తెలుగుకు పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ. అలా తెలుగులో అడపాదడపా కనిపించిన జరీనాను చాల కాలం తరువాత శ్రీకాంత్ ఓదెల .. దసరా కోసం రంగంలోకి దింపాడు. అప్పటినుంచి ఆమె తెలుగువారికి సుపరిచితంగా మారింది. తల్లి, బామ్మ పాత్రలకు టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా మారింది.
ద రాజాసాబ్ లో ప్రభాస్ నాన్నమ్మ పాత్రలో జరీనా ఒదిగిపోయింది. మహారాణి గంగాదేవిగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా చిరు తల్లిగా.. నయన్ కి అత్తగారిగా ఆమె చెప్పే డైలాగ్స్.. ఆ హుందాతనం ఆకట్టుకుంది. ప్రస్తుతం అందరూ ఆమె నటనను ప్రశంసిస్తున్నారు. ముందు ముందు జరీనా తెలుగులో మరిన్ని సినిమాల్లో కనిపిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.