'విశ్వంభర' ఫ్యాన్స్‌కు గుర్తుందా.. మర్చియారా?
ABN , Publish Date - May 24 , 2026 | 08:47 AM
మెగాస్టార్ నుంచి ఒక భారీ సోషియో ఫాంటసీ సినిమా వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలే. మరి అలాంటి మెగాస్టార్ నుంచి ఒక భారీ సోషియో ఫాంటసీ సినిమా వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో, UV క్రియేషన్స్ (UV Creations) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం విశ్వంభర (Vishwambhara). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో ఒకటే ప్రశ్న.. అసలు విశ్వంభర సినిమాను మర్చిపోయేలా ఉన్నారుగా..? అనే సందేహం అందరిలోనూ మొదలైంది.
ఈ ప్రాజెక్ట్ మొదలై దాదాపు మూడేళ్లు దాటిపోతోంది. నిజానికి షూటింగ్ పార్ట్ అంతా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ, ఇప్పటివరకు రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నోరు మెదపడం లేదు. ఏ చిన్న అప్‌డేట్ ఇవ్వడానికి కూడా టీమ్ సాహసించడం లేదు. ఈ గ్యాప్‌లోనే మెగాస్టార్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా థియేటర్లలోకి రావడం, బ్లాక్ బస్టర్ సాధించడం జరిగిపోయింది. ఆ సినిమా హడావుడి కూడా ముగిసిపోయింది కానీ.. విశ్వంభర ముచ్చట్లు మాత్రం ఇంకా తేలలేదు.
విశ్వంభర సంగతి పక్కన పెడితే.. మెగాస్టార్ అప్పుడే తన తదుపరి సినిమాను కూడా పట్టాలెక్కించేశారు. వాల్తేరు వీరయ్య లాంటి మాస్ కమర్షియల్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై Mega 158 మూవీ సెట్స్ మీదకు వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి డైరెక్టర్ బాబీ ఒక పక్కా ప్లాన్‌తో నాన్‌స్టాప్ షూటింగ్ షెడ్యూల్‌ను రెడీ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్‌గా పనులు సాగుతున్నాయి. ఒక సినిమా కంటే ముందే అనౌన్స్ అయిన విశ్వంభర అలానే ఉండిపోయి, ఆ తర్వాత లైన్లోకి వచ్చిన సినిమా స్పీడ్ పెంచడంతో ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజన్‌లో పడ్డారు.
అయితే, విశ్వంభర ఆలస్యమవడానికి గల అసలు కారణం వేరే ఉంది. ఈ సినిమాను నిర్మిస్తున్న UV క్రియేషన్స్ సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఇది మామూలు కథ కాదు.. ఏకంగా 14 లోకాలకు సంబంధించిన విలక్షణమైన సోషియో ఫాంటసీ కథాంశం. అంటే సినిమాలో గ్రాఫిక్స్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయో మనం ఊహించుకోవచ్చు. హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్ తీసుకురావాలనే పట్టుదలతో, గ్రాఫిక్స్ వర్క్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ల్యాగ్‌లు లేకుండా పర్‌ఫెక్ట్ విజువల్స్ ఇవ్వడానికే ఈ సమయం పడుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాను అద్భుతంగా చెక్కుతున్నారు సరే.. కానీ ఒక చిన్న భయం కూడా ఉంది.
జనరల్‌గా ఏదైనా ఒక సినిమా రిలీజ్ డేట్ బాగా ఆలస్యమైతే, కాలక్రమేణా దానిపై ఉండే హైప్, అంచనాలు తగ్గుతూ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్రేజ్‌ను, అంచనాలను అలానే కాపాడుకుంటూ రావడం అనేది ఇప్పుడు నిర్మాతల చేతుల్లోనే ఉంది. అందుకే వారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్ స్ట్రాటజీలను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూడాలని థియేటర్లలో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికైనా విశ్వంభర మూవీ టీమ్ ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా తీసుకుని, అభిమానుల ఆకలి తీర్చేలా ఒక అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తుందేమో చూడాలి.