సూర్యతో.. పూరి జగన్నాథ్! మళ్ళీ.. ‘బిజినెస్ మాన్’ రేంజ్‌లో!

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:23 PM

వరుస పరాజయాలతో సతమతమవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్

Puri Jagannadh Suriya

వరుస పరాజయాలతో సతమతమవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి సినిమాలు పూరిని తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ, ఆయన బ్రాండ్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్' సినిమాను చేస్తున్నారు పూరి. ఈ సినిమా తర్వాత పూరి తన తదుపరి చిత్రం కోసం ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తో జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సాధారణంగా ఏ దర్శకుడికైనా రెండు భారీ డిజాస్టర్ల తర్వాత మళ్ళీ స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా కష్టం. కానీ పూరి జగన్నాథ్ మీద ఉన్న నమ్మకం, ఆయన మేకింగ్ స్టైల్ ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాయి. సూర్య కూడా పూరి పని తీరును ఎప్పటి నుంచో గమనిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఇటీవల కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కలయిక పట్టాలెక్కితే టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒక సంచలనంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.

గతంలోనే పూరి - సూర్య కాంబినేషన్ కుదరాల్సి ఉండటం ఒక విశేషం. మహేష్ బాబుతో తెరకెక్కించిన 'బిజినెస్ మాన్' కథ మొదట సూర్య దగ్గరకే వెళ్ళింది. ఆయన కూడా ఆ కథకు ఓకే చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అందుకే మహేష్ బాబు హీరోగా చేసినా, ఆ చిత్రంలో హీరో పేరును సూర్య గానే ఉంచారు పూరి. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ అవకాశం రావడంతో, ఈసారి పక్కాగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో పూరి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Puri Jagannadh Suriya

ప్రస్తుతం పూరి జగన్నాథ్ 'స్లమ్ డాగ్' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ కారణంగా రిలీజ్ కొంత ఆలస్యమైనప్పటికీ, ఈ వేసవిలో తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పూరి అభిమానులు సైతం 'స్లమ్ డాగ్' చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత సినిమాల విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని, ఈ సినిమాను పూరి చాలా జాగ్రత్తగా రాసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా క్లిక్ అయితే, సూర్యతో చేయబోయే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. పూరి మార్క్ 'వింటేజ్' కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అటు సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా రిలీజ్ కోసం సిద్ధమవుతూనే, వెంకీ అట్లూరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ పనులు ముగియగానే పూరి ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫ్లాపుల పర్వంలో ఉన్న దర్శకులకు అవకాశాలు రావడం కష్టమైన తరుణంలో, పూరి ఇలాంటి క్రేజీ కాంబోను సెట్ చేసుకోవడం ఆయన స్టామినాను తెలియజేస్తోంది. మరి ఈ 'జాక్ పాట్' ప్రాజెక్ట్ పూరి కెరీర్‌కు మళ్ళీ పూర్వవైభవం తెస్తుందో లేదో చూడాలి.

Updated Date - Feb 26 , 2026 | 06:30 PM