Deepthi Reddy: మరణంలోనూ మహోన్నత నిర్ణయం.. దీప్తి రెడ్డి అవయవ దానం

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:19 PM

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ మాడుగుల (Pradeep MAdugula) భార్య, వ్యాపారవేత్త దీప్తి రెడ్డి (Deepthi Reddy) కన్నుమూశారు.

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ మాడుగుల (Pradeep MAdugula) భార్య, వ్యాపారవేత్త దీప్తి రెడ్డి (Deepthi Reddy) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ డెడ్‌ కావడంతో ఆమె మరణించినట్లు  వైద్యులు  ప్రకటించారు.  తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు దీప్తి రెడ్డి ఆకాంక్ష మేరకు అవయవ దానానికి సమ్మతించారు. విరాట్ ఫౌండేషన్ సహకారంతో జీవన్‌దాన్ ద్వారా అవయవ దానానికి సంబంధించిన అధికారిక ప్రక్రియను వైద్యులు చేపట్టారు. ఈ ఏడాది జూన్ 18న మరణానంతరం అవయవ దానం చేస్తానని ఆమె ప్రకటించారు. 

ఆమె చివరి కోరికను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడం విశేషం. ఆమె నిర్ణయం ద్వారా మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం ఏర్పడింది. దీప్తి రెడ్డి మృతిపట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యష్ వీరగోని మాట్లాడుతూ.. దీప్తి రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్ర దుఃఖ సమయంలోనూ ఆమె అవయవ దాన ఆకాంక్షను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం గొప్పదని పేర్కొన్నారు. 

Updated Date - Sep 27 , 2026 | 04:22 PM