Krishna Vamsi: ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ని నమ్మే నిర్మాతనే లేడా

ABN , Publish Date - Jan 18 , 2026 | 08:37 PM

ఒకప్పటి లెజండరీ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Krishna Vamsi

Krishna Vamsi: ఒకప్పటి లెజండరీ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కుటుంబ కథా చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ కృష్ణ వంశీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సింధూరం, ఖడ్గం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ వంశీ. అయితే కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది అన్నట్లు.. కొత్త డైరెక్టర్లు రావడంతో కృష్ణ వంశీ వెనుక పడ్డాడు. అందులో వరుస ప్లాప్ లు అందుకోవడంతో అవుట్ డేటెడ్ అని ముద్ర వేసేశారు.

చాలా గ్యాప్ తరువాత రంగ మార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కృష్ణవంశీ. కానీ, అది కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఒక మంచి కథతో ఎందుకు మరో సినిమా తీయలేకపోతున్నాడు అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దానికి కృష్ణ వంశీ సమాధానం చెప్పుకొచ్చాడు. సినిమాలు చేయకపోయినా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.

పాత, కొత్త సినిమాల గురించి నెటిజన్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఒక నెటిజన్.. తన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉందని, కచ్చితంగా విజయవంతం అవుతుంది అని.. పర్మిషన్ ఇస్తే కథ చెప్తాను అని చెప్పగా.. కృష్ణవంశీ.. ప్రొడ్యూసర్ మాటేంటి అని సమాధానం ఇచ్చాడు. అంటే నిర్మాతలు దొరకడం లేదు అని చెప్పకనే చెప్పాడు. కృష్ణవంశీ కథలు రాస్తున్నా వాటిని తెరకెక్కించే నిర్మాత లేడు. ఇప్పుడే కాదు కొన్నేళ్లుగా ఆయన అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. మొగుడు సినిమా డిజాస్టర్ నుంచి మొన్నీమధ్య వచ్చిన రంగ మార్తాండ వరకు ఆయన ఈ సమస్య నుంచి బయటపడడం లేదు. కొత్త సినిమాలకు నిర్మాతలు కావాలి. ఎవరు ఆయనను నమ్మి సినిమా తీస్తామనడం లేదు. అందుకే అలా లెజండరీ డైరెక్టర్.. ఇలా పోస్టులు పెట్టుకుంటూ ఉండిపోయాడు. మరి ముందు ముందు కూడా కృష్ణవంశీ ఇలాగే ఉండిపోతాడా..? బౌన్స్ బ్యాక్ ఏమైనా అవుతాడా.. ? అనేది చూడాలి.

Updated Date - Jan 18 , 2026 | 08:37 PM