'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఎన్నో ఆశలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:45 PM

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ అందరి చూపు రాబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) పైనే ఉంది... ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) పైనా చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ అందరి చూపు రాబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) పైనే ఉంది. ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) పైనా చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. నేటితో దర్శకుడిగా హరీశ్ శంకర్ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

మధురం మధురం... 'షాక్'...

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'షాక్' చిత్రంతో దర్శకుడిగా  పరిచయమయ్యారు హరీశ్ శంకర్. రవితేజ, జ్యోతిక జంటగా రూపొందిన 'షాక్' సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే దర్శకునిగా హరీశ్ శంకర్ మాత్రం తన మేకింగ్ స్టైల్ తో మంచి మార్కులే సంపాదించారు... 'షాక్' సినిమా 2006 ఫిబ్రవరి 9న విడుదలయింది. ఇందులో కొన్ని సీన్స్ ను హరీశ్ శంకర్ తెరకెక్కించిన తీరు సినీ ప్రేమికులను మెప్పించింది. అదే తీరున హీరో రవితేజకు కూడా హరీశ్ స్టైల్ నచ్చేసింది. దాంతో 'మిరపకాయ్'తో మరో ఛాన్స్ ఇచ్చారు రవితేజ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే హరీశ్ శంకర్ తొలి సినిమా 'షాక్' మాత్రం ఆయనకు సదా గుర్తుండిపోయేలా నిలచింది...

మూడో సినిమాతో బ్లాక్ బస్టర్... !

ఈ యేడాది ఫిబ్రవరి 9తో హరీశ్ శంకర్ చిత్ర ప్రయాణం ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సమయంలోనే ఆయన పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' రూపొందించడం విశేషం. హరీశ్ కు 'మిరపకాయ్' విజయాన్ని అందించినా, ఆయన కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' సొంతం చేసింది. 'గబ్బర్ సింగ్' హరీశ్ కు మూడో సినిమా. ఈ చిత్రానికి ముందు పవన్ "పులి, తీన్ మార్, పంజా" వంటి ఫ్లాప్స్ చూశారు. అదే టైమ్ లో హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా వరుస ఫ్లాపులతో 'ఐరన్ లెగ్' అనే బ్రాండ్ తో ఉన్నారు. ఇక చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కు కూడా అంతకు ముందు బిగ్ హిట్స్ ఏమీ లేవు. అలా వారందరి కాంబోలో హరీశ్ తన మూడో చిత్రంగా 'గబ్బర్ సింగ్'ను రూపొందించారు. బ్లాక్ బస్టర్ హిట్ పట్టేశారు...

అందరిలోనూ ఆసక్తి...

'గబ్బర్ సింగ్' గ్రాండ్ సక్సెస్ తరువాత హరీశ్ డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' రూపొందింది... ఆ సినిమా పరాజయం పాలయింది... ఆ పై సాయి దుర్గా తేజ్ హీరోగా హరీశ్ తీసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' పర్లేదనిపించుకుంది... హరీశ్ ఆరో చిత్రంగా అల్లు అర్జున్ తో రూపొందిన 'దువ్వాడ జగన్నాథమ్' బంపర్ హిట్టయింది... ఆ పై వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ తెరకెక్కించిన 'గద్దలకొండ గణేశ్' మంచిమార్కులే పోగేసింది... తన తొలి హీరో రవితేజతో హరీశ్ శంకర్ 2024లో 'మిస్టర్ బచ్చన్' రూపొందించగా అది పరాజయం పాలయింది... ఈ నేపథ్యంలోనే  'గబ్బర్ సింగ్' తరువాత 14 ఏళ్ళకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకెక్కించారు హరీశ్ శంకర్... అందువల్లే రాబోయే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి... ఈ యేడాదితో డైరెక్టర్ గా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి...

 

Updated Date - Feb 10 , 2026 | 04:01 PM