Gunasekhar: ఒక్కడు.. మహేష్ కోసం రాయలేదు

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:50 PM

స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో భారీ భారీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Gunasekhar

స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో భారీ భారీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఒక్కడు (Okkadu), చూడాలని ఉంది, అర్జున్, రుద్రమదేవి, వరుడు లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గుణశేఖర్ కి సరైన హిట్ అందలేదు. ఈ ఏడాది యుఫోరియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఒక మంచి కథను రాసుకొని.. సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారట గుణశేఖర్.


తాజాగా గుణశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తాను కథలను రాయలేదని ఆయన తెలిపారు. అలా హీరోని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా సైనికుడు అని చెప్పుకొచ్చారు. ఒక్కడు కథను స్టార్ ని దృష్టిలో పెట్టుకొని రాయలేదని.. పాతబస్తీలో చార్మినార్ వద్ద ఛాయ్ తాగే కుర్రాడి కథగా రాసుకున్నట్లు ఆయన తెలిపారు.


'ఒక్కడు, అర్జున్ తరువాత సైనికుడు సినిమా సమయంలో భారీ సెట్టింగ్స్, హీరోను దృష్టిలో పెట్టుకొనివెళ్ళిన కథలు అవి.. అవే నాకే గుణపాఠం చెప్పాయి. మళ్ళీ ఆ తప్పు అయితే చేయను. మహేష్ బాబు మీద కథ రాద్దాం. అలాంటివేమీ లేవు. అప్పుడు ఒక్కడు కథ కూడా మహేష్ కోసం రాయలేదు. మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఇష్టమైనది చార్మినార్ దగ్గర కూర్చొని టీ తాగడం. అలాగే పాతబస్తీలో చార్మినార్ వద్ద ఛాయ్ తాగే కుర్రాడి కథ రాయాలనిపించింది. అలాంటి కథకు మహేష్ బాబు అయితే బావుంటుంది కదా అనుకోని కథ అలా రాశాను. దానికి రాయలసీమ ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ఇలా కథలో నుంచి పుట్టింది కాబట్టే అది ఒక్కడు అయ్యింది. నేను ఒక్కడుగా మహేష్ బాబు కోసం కథ రాయడం మొదలుపెడితే అది మరో సైనికుడు అయ్యుండేదేమో' అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jun 02 , 2026 | 06:05 PM