బండ్ల గ‌ణేశ్ హీరోగా చేసిన.. ఆ సినిమా రిలీజ్ అయి ఉంటేనా! ఎక్క‌డో.. ఉండే వాడు

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:39 PM

ప్రముఖ నటుడు బండ్ల గణేశ్‌ హీరోగా 2002లో ఓ సినిమా మొదలై ఆగిపోయింది. అయితే ఆ తర్వాత ఇరవై యేళ్ళకు మరో సినిమాలో బండ్ల గణేశ్‌ హీరోగా నటించారు.

Bandla Ganesh Sinugadu movie opening

నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) నిత్యం వార్తల్లో ఏదో కారణంగా నానుతూనే ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు... వాటికి వివరణ ఇచ్చే తీరులోనూ ఆయన తనదైన శైలిని ప్రదర్శిస్తుంటారు. ఇటీవల తిరుమలకు పాదయాత్ర చేసిన బండ్ల గణేశ్‌కు సంబంధించిన దాదాపు పాతికేళ్ళ నాటి ముచ్చటను దర్శకుడు బాబ్జీ ఇటీవల వెల్లడించారు.

'వినోదం' సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేశ్‌ పలు చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy), ఇవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) చిత్రాలలో ఎక్కువగా నటించి, వినోదాన్ని పండించారు. నటుడిగా కెరీర్ మసకబారుతున్న సమయంలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, భారీ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాత అనిపించుకున్నారు. అయితే కొంతకాలంగా చిత్ర నిర్మాణానికీ దూరంగా ఉన్న బండ్ల గణేశ్‌ ఇప్పుడు మళ్ళీ ముఖానికి రంగేసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. బండ్ల గణేశ్‌ సినిమాలో ఉన్నాడంటే అదే ప్రత్యేక విషయంగా మారిపోయింది. మార్చి 6న రాబోతున్న 'సాంప్రదాయిని సిప్పిని సుద్దపూసని' సినిమాలో బండ్ల గణేశ్‌ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు.


నటుడిగా పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేశ్‌ నిజానికి 2002లోనే ఓ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా పేరు 'శీనుగాడు'. బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా మొదలైంది.

WhatsApp Image 2026-02-24 at 1.01.37 PM.jpeg

సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 'బాచి' ఫేమ్ నీలాంబరి అందులో హీరోయిన్. 'శీనుగాడు' సినిమా కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ నిర్మాత హఠాన్మరణంతో ఆ సినిమా కాస్తా ఆగిపోయింది. ఒకవేళ ఆ సినిమా పూర్తయ్యి, విడుదలై విజయం సాధించి ఉంటే... ఇవాళ బండ్ల గణేశ్‌ నిర్మాతగా కాకుండా హీరోగా మన ముందు ఉండేవారు. కానీ ఆయన్ని విధి నిర్మాతగా మార్చేసింది. ఈ విషయాన్ని బాబ్జీ తలుచుకుంటూ... 'ఏదేమైనా బండ్ల గణేశ్‌ ఆ తర్వాత నటుడిగా కొనసాగి, నిర్మాతగా మారి, అగ్ర నిర్మాతల సరసన నిలవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది' అని అన్నారు.

WhatsApp Image 2026-02-24 at 1.01.36 PM.jpeg

ఇదిలా ఉంటే... హీరో కావాలనే బండ్ల గణేశ్‌ కోరిక 2021లో తీరింది. పార్తీబన్ నటించిన తమిళ చిత్రం 'ఒత్త సేరుప్పు సైజ్ 7'ను బండ్ల గణేశ్‌ హీరోగా తెలుగులో 'డేగల బాబ్జీ' పేరుతో రీమేక్ చేశారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వాతి చంద్ర నిర్మించారు. అయితే... తమిళంలో మాదిరి ఈ సినిమా తెలుగులో ఆడలేదు. అన్నట్టు దర్శకుడు బాబ్జీ ఇటీవల తన కొడుకు సన్నీ అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'పోలీసు వారి హెచ్చరిక' మూవీని రూపొందించారు. సన్నీ అఖిల్ నటించిన మరో చిత్రం 'పిఠాపురంలో' విడుదల కావాల్సి ఉంది.

Updated Date - Feb 25 , 2026 | 07:27 PM