‘దేత్తడి’... హైదరాబాద్ సంస్కృతిని ఆవిష్కరిస్తుంది
ABN , Publish Date - Mar 25 , 2026 | 09:14 AM
ఆశిష్ హీరోగా ఆదిత్యరావు గంగసాని దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేత్తడి’.
‘రౌడీబాయ్స్, లవ్‌మీ’ చిత్రాలతో హీరోగా యువతకు చేరువయ్యారు ఆశిష్ (Ashish). ఆయన హీరోగా ఆదిత్యరావు గంగసాని (Aditya Rao Gangasani) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేత్తడి’ (Dethadi). దిల్‌రాజు ప్రొడక్షన్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డ్రమ్స్ వాయిద్యకారుడు ఘన్నూ భాయ్ పాత్రలో ఆశిష్ మాస్‌లుక్‌తో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రం గ్లింప్స్‌ను మంగళవారం యూనిట్ విడుదల చేసింది. ఆశిష్ ఈ పాత్ర కోసం పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘దేత్తడి’ కథ పుట్టడానికి కారణం దర్శకుడు ఆదిత్య. కథ కోసం చాలా లోతైన పరిశోధన చేశారు. ఘన్ను అనే బ్యాండ్ కళాకారుడి కథతో హైదరాబాద్ సాంస్కృతిక వేడుకల నేపథ్యంలో కథ సాగుతుంది. తమ జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిదని తెలుసుకొని, బ్యాండ్ కళాకారులు స్వచ్ఛందంగా వందల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆశిష్ తన పాత్ర కోసం ఏడాది పాటు డ్రమ్స్ వాయిద్యంలో మెలకువలను నేర్చుకొన్నాడు’ అని ప్రశంసించారు. ఆశిష్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ కల్చర్‌ని ‘దేత్తడి ’లో ఒక రేంజ్‌లో చూపించబోతున్నాం. ప్రతి బ్యాండ్ కళాకారుడు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పారు. ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కారణం ఆశిష్ అని దర్శకుడు తెలిపారు.