'డిసి' ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటేనా

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:21 PM

చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం.

Vijay Devarakonda

చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. ఈ క్రమంలో ఎంతోమంది స్టార్ హీరోలు వదులుకున్న కథలు, వేరే హీరోల చేతుల్లోకి వెళ్లాక ఇండస్ట్రీ హిట్‌లుగా నిలిచిన సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా నటించిన డిసి చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించారని, కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయారని, ఆ తర్వాతే ఇది లోకేష్ కనగరాజ్ వద్దకు చేరిందని వార్తలు వస్తున్నాయి.


లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ డిసి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వామిక గబ్బీ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక కథ వినిపించారని వెల్లడించాడు. కథ బాగా నచ్చినప్పటికీ, అప్పటికే తాను చేస్తున్న సినిమాల శైలిలోనే ఆ కథ కూడా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయానని స్పష్టం చేశాడు. ఇప్పుడు డిసి సినిమా విడుదలైన తర్వాత, అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండ కోసమే ఈ కథను సిద్ధం చేశారా? విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలోనే లోకేష్ కనగరాజ్ నటించారా? అనే చర్చ నెటిజన్ల మధ్య ఊపందుకుంది. అయితే దీనిపై విజయ్ కానీ, దర్శకుడు అరుణ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.


కథ మొత్తం ఒకటి కాకపోయినా విజయ్ నటిస్తోన్న రౌడీ జనార్ధన ఫుల్ యాక్షన్ సినిమా అని అందరికీ తెల్సిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండడంతోనే విజయ్.. డిసిని కాదు అన్నాడని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమన్నా డిసి కనుక విజయ్ కి పడి ఉంటే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచేది అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. కొన్నేళ్లుగా హిట్ లేని విజయ్.. తన ఆశలన్నీ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి మీదనే పెట్టుకున్నాడు. సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా రౌడీ జనార్ధన డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్‌తో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్‌ను విజయ్ లైన్‌లో పెట్టాడు. మరి ఈ సినిమాలతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 09 , 2026 | 04:23 PM