పెద్ది విడుదలపై వ్యూహాత్మక మౌనం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:06 PM

'పెద్ది' సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ ను నిర్మాత ఎస్.కె.ఎన్. ఉద్దేశ్యపూర్వకంగానే లీక్‌ చేశారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'పెద్ది' ఏప్రిల్ 30కి రావడం కష్టమని వీరు చెబుతున్నారు.

Peddi Movie

ప్రస్తుతం చిత్రసీమలో జరుగుతున్న చర్చంతా 'పెద్ది' సినిమా విడుదల తేదీ గురించే! ఎందుకంటే ఒక పెద్ద సినిమా వస్తోందంటే దానికి ఒక వారం ముందు, వారం తర్వాత రావాల్సిన సినిమాలన్నీ వెనక్కో ముందుకో జరిగిపోతాయి. పెద్ద సినిమాకు దారిఇస్తాయి. ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల కాబోతున్న నేపథ్యంలో తమ 'లెనిన్' సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు.

చిత్రం ఏమంటే... ఈ ప్రకటన వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే 'పెద్ది' రిలీజ్ జూన్ 25కు వాయిదా పడిందనే రూమర్స్ వచ్చేశాయి. ఇది సోషల్ మీడియాలో ఎవరో చేస్తున్న ప్రచారం అయితే ఎవ్వరూ నమ్మకపోదురు కానీ మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన నిర్మాత ఎస్.కె.ఎన్‌. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ సాంగ్ రిలీజ్‌ ఈవెంట్‌లో 'పెద్ది' జూన్ నెలకు వెళ్ళినట్టుగా తనతో సాయి రాజేశ్‌ అన్నాడని, అందుకే తమ సినిమాను ఆ తేదీకి విడుదల చేయాలని అనుకున్నా... ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నామని చెప్పాడు. దాంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన 'పెద్ది' సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు డైరెక్ట్ గా నిర్మాతలు చెప్పకుండా ఇలా ఇతరులతో లీక్స్ ఇప్పిస్తున్నారని కొందరంటున్నారు.

అయితే ఎస్.కె.ఎన్. ఆ ప్రెస్ మీట్‌ కాగానే 'పెద్ది' రిలీజ్‌ డేట్ విషయంలో తాను పొరపాటు పడ్డానని, సాయిరాజేశ్‌ చెప్పిన విషయాన్ని తాను సరిగా అర్థం చేసుకోకుండా మాట్లాడేశానని, ఆ సినిమా రిలీజ్ గురించి మేకర్స్ అధికారికంగా ఇంకా ఏమీ చెప్పలేదని వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్‌ జరిగిపోయింది.


'పెద్ది' విడుదల వాయిదా వేయడం కరక్టేనని కొందరు, ఇంకా ఎన్ని రోజులు ఇలా వాయిదా వేస్తారంటూ మరికొందరు... చిన్న చిత్రాల నిర్మాత ఇబ్బందులు మీకసలు పట్టవా? అంటూ మరికొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో 'పెద్ది' ఏప్రిల్ 30న వస్తుందా? రాదా అనే విషయం మరింత జటిలమైపోయింది. ఎస్.కె.ఎన్. వ్యాఖ్యలు, ఆ పైన ఇచ్చిన వివరణ తర్వాత కూడా 'పెద్ది' రిలీజ్‌ డేట్ గురించి ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఎలాంటి స్టేట్ మెంట్‌ ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని కొందరు అంటున్నారు. మరో నాలుగు వారాల సమయం ఉంది కాబట్టి... ఆచితూచి ఏ ప్రకటన అయినా చేయాలని వారు అనుకుంటున్నారట. అయితే... పాన్ ఇండియాగా వివిధ భాషల్లో విడుదల కాబోతున్న 'పెద్ది' విషయంలో ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం కరెక్ట్ కాదని, ఇలా అయితే... ప్రమోషన్స్ విషయంలో చాలా వెనకబడినట్టు అయిపోతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు 'పెద్ది' నిజంగానే జూన్ 25కి వాయిదా పడితే... మరి తిరిగి 'లెనిన్‌' సినిమాను ముందుకు తీసుకొస్తారేమో చూడాలి.

Updated Date - Mar 31 , 2026 | 12:09 PM