మాటల మాంత్రికుడి ఆదర్శ కుటుంబంలోకి.. ధురంధర్ నటుడు
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:46 AM
'ధురంధర్, ధురంధర్-2' చిత్రాల్లో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమదైన ముద్ర వేసి ప్రేక్షకులను మెప్పించారు.
'ధురంధర్, ధురంధర్-2' చిత్రాల్లో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమదైన ముద్ర వేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమాల్లోని పాత్రలను కానీ, వాటిని పోషించిన నటులను కానీ అంత సులువుగా మర్చిపోలేం. ముఖ్యంగా దురంధర్-2 (Dhurandhar The Revenge) లో కొద్దిసేపే కనిపించినప్పటికీ, ఉదయ్ వీర్ సంధు (Udaybir Sandhu) అనే యువ నటుడు బలమైన ప్రభావాన్ని చూపారు. 'పిందా' అనే డ్రగ్ స్మగ్లర్ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అద్భుతంగా సాగింది. ఇప్పుడు ఇదే ప్రతిభావంతుడైన పంజాబీ నటుడిని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) సిద్ధమయ్యారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'ఆదర్శకుటుంబం-ఏకే 47' సినిమా గత కొన్ని నెలలుగా శబ్దం లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో విలన్ పాత్ర కోసం గతంలో పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ, చివరకు ఉదయ్ వీర్ సంధును ఖరారు చేసినట్లు సమాచారం. 'ధురంధర్-2'లో ఆయన నటనకు ముగ్ధుడైన మాటల మాంత్రికుడు, ఈ సరికొత్త ప్రతినాయకుడిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారట.
త్రివిక్రమ్ సినిమాల్లో విలన్ పాత్రలు కేవలం కఠినంగా ఉండటమే కాకుండా, ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అలాగే ప్రతినాయక పాత్రలను సైతం వినోదాత్మకంగా తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. ఉదయ్ వీర్ సంధుకు తెలుగులో సరైన పాత్ర లభిస్తే, ఇక్కడ ఆయన బిజీ నటుడిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈయన గతంలో హిందీలో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' చిత్రంతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'అమర్ సింగ్ చంకీలా'లో కూడా నటించి తన సత్తా చాటారు. ఇప్పుడు నేరుగా వెంకటేష్ వంటి స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆయన కెరీర్‌కు ప్లస్ కానుంది.
ఈ చిత్రంలో కథానాయికగా 'కేజీఎఫ్' భామ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను త్రివిక్రమ్ మలుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు త్రివిక్రమ్ చమత్కారాలు తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ధురంధర్ చిత్రంలో బలూచ్ పాత్ర పోషించిన బిమల్ రాయ్ (Bimal Oberoi) ఎన్టీఆర్ నీల్ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుండగా ఇప్పుడు ఇదే ధురంధర్ చిత్రం నుంచి మరో నటుడు ఉదయ్ వీర్ నటించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ సినిమాకు సంగీతం అందించిన సచ్‌దేవ్ (Shashwat Sachdev) సైతం తెలుగులో నిఖిల్ ఇండియా హౌస్ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. ఇలా ధురంధర్ సినిమాకు పని చేసిన ముగ్గురు ఇప్పుడు తెలుగులోనూ ఆరంగేట్రం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.