ధనుష్‌తో ‘ఇరుముడి’ దర్శకుడు.. కాంబో సెట్టా!

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:59 PM

దర్శకుడు శివ నిర్వాణ ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో తెలియంది కాదు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ చేయబోయే ప్రాజెక్ట్‌పై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Dhanush and Shiva Nirvana

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో తెలియంది కాదు. ప్రియా భవానీ శంకర్, నక్షత్ర, సాయి కుమార్ కీలక పాత్రల్లో మెరిసిన ఈ సినిమా, ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ భారీ విజయం తర్వాత ఇప్పుడు టాలీవుడ్ మొత్తం చూపు డైరెక్టర్ శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్ వైపే మళ్లింది. ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శివ నిర్వాణ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్‌లో చాలా ఆసక్తికరంగా మారింది. పలువురు యంగ్ హీరోలతో పాటు కొందరు సీనియర్ హీరోలు కూడా ఆయనతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మధ్యలో నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని తర్వాత తేలిపోయింది.


ఇక ఇప్పుడు అనూహ్యంగా శివ నిర్వాణ లిస్టులోకి తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) వచ్చినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలోనే ఒక భారీ బైలింగ్వెల్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు ‘ఇరుముడి’ కంటే ముందే మొదలయ్యాయట. ధనుష్‌తో శివ నిర్వాణ ఇప్పటికే కథా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ధనుష్ లాంటి వర్సటైల్ హీరో కోసం శివ నిర్వాణ ఎలాంటి కథ సిద్ధం చేసి ఉంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే మాత్రం తెలుగు, తమిళ భాషల్లో అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటం, శివ నిర్వాణ ట్రాక్ రికార్డ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి.


మరోవైపు ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓమ్’ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత తమిళరసన్ పచముత్తుతో ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్, డైరెక్టర్ శివతో ఒక రూరల్ మూవీ లైనప్‌లో ఉన్నాయి. అలాగే మారి సెల్వరాజ్, వెట్రిమారన్‌లతోనూ భారీ బడ్జెట్ సినిమాలు ప్రకటించినప్పటికీ, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. ఈ క్రమంలో తమిళరసన్ పచముత్తు సినిమా పూర్తయిన తర్వాతే శివ నిర్వాణ - ధనుష్ కాంబో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ధనుష్-శివ నిర్వాణ కాంబోలో ఈ బైలింగ్వెల్ ప్రాజెక్ట్ ఎప్పుడు రూపుదిద్దుకుంటుంది? ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడు రానుంది అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:

అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ కాంట్రవర్సీ.. వర్మ పోస్ట్ వైరల్

నేపాల్‌కు ‘చేయూతనివ్వండి’.. రంగంలోకి రియల్ హీరో

ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్

Updated Date - Sep 04 , 2026 | 01:59 PM