దేవర2.. వెయ్యి కోట్ల బొమ్మేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆశ నెరవేరేనా!
ABN , Publish Date - May 03 , 2026 | 07:24 AM
దేవర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, సెకండ్ పార్ట్ మీద ప్రేక్షకుల్లో అంతులేని ఆసక్తిని రేకెత్తించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కలయికలో వచ్చిన దేవర ( Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన ఈ సినిమా, తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, సెకండ్ పార్ట్ మీద ప్రేక్షకుల్లో అంతులేని ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో 'దేవర-2' చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్పుడే ట్రెండ్ మొదలుపెట్టేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో 'దేవర-2' ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే తారక్ మళ్ళీ దేవర లోకంలోకి అడుగుపెట్టే వీలుంది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. ఆయన నందమూరి బాలకృష్ణ (Balakrishna) తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల ప్రస్తుత కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే 'దేవర-2' సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంటే, ఈ సీక్వెల్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. కానీ ఈ గ్యాప్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందే తప్ప తగ్గించదని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి ఎన్టీఆర్ కెరీర్‌లో సోలో హీరోగా వెయ్యి కోట్ల మార్కును అందుకోవాలనేది అభిమానుల చిరకాల కోరిక. 'ఆర్ఆర్ఆర్' తో ఆ ఘనత సాధించినప్పటికీ, అది మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఇప్పుడు అందరి కళ్లు 'డ్రాగన్', 'దేవర-2' చిత్రాలపైనే ఉన్నాయి. అయితే వెయ్యి కోట్ల వసూళ్లు అనేది సామాన్యమైన విషయం కాదు. కేవలం హీరో ఇమేజ్ మాత్రమే కాకుండా, బలమైన కథాబలం, పకడ్బందీ మార్కెటింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ను మెప్పించే కంటెంట్ ఉంటేనే ఆ మైలురాయిని చేరుకోవడం సాధ్యమవుతుంది.
'దేవర' మొదటి భాగం క్రియేట్ చేసిన హైప్, పార్ట్-2 కి ఒక బలమైన పునాదిగా నిలిచింది. కొరటాల శివ అందించే విజువల్ ట్రీట్, ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తోడైతే వెయ్యి కోట్ల లక్ష్యం కష్టం ఏమీ కాదని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న ఈ విపరీతమైన క్రేజ్‌ను కలెక్షన్లుగా మార్చడంలో ఈ చిత్రం సక్సెస్ అయితే, తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చాటినట్టే అవుతుంది. తారక్ ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.