ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో 'దేవర 2'

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:59 PM

'దేవర 2' సినిమా ఖచ్చితంగా ఉంటుందని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఇటీవల స్పష్టం చేశారు. దీంతో మే నెలలోనే 'దేవర 2' రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

NTR

'ట్రిపుల్ ఆర్' (RRR) ఘనవిజయం తరువాత యన్టీఆర్ (NTR) 'దేవర' (Devara) చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని యన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భాగస్వామిగా సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణతో కలసి నిర్మించారు. 'ట్రిపుల్ ఆర్' క్రేజ్ తో 'దేవర' సినిమా టిక్కెట్ రేట్స్ కూడా హైక్ చేశారు. మొదటి మూడు రోజుల తరువాత ఆ టిక్కెట్ రేట్స్ పెంపుదల 'దేవర'పై తీవ్ర ప్రభావం చూపించింది. వారం అయిన తరువాత టిక్కెట్ ధరలు తగ్గాక 'దేవర' చిత్రం పుంజుకుంది. మొదట్లో 'దేవర' ఫ్లాప్ అంటూ ప్రచారం సాగింది. అనూహ్యంగా ఆ సినిమా టిక్కెట్ రేట్స్ సాధారణ స్థితికి రాగానే ఊపందుకుంది. అలా మొత్తానికి 500 కోట్ల రూపాయలు పోగేసి హిట్ గా నిలచింది 'దేవర'.


'దేవర' సినిమా చక్కని విజయం సాధించినా దాని సీక్వెల్ నిర్మాణంలో మాత్రం ఊహించని జాప్యం జరుగుతూ వస్తోంది. 'దేవర' హిట్ అయినా... ఎక్కడో ఏదో అసంతృప్తి మేకర్స్‌ను వెంటాడుతోందనిపిస్తోంది. అందుకే 'దేవర 2'ను మరింత పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) మరింతగా కృషి చేస్తున్నాడని అంటున్నారు. ఇతర ప్రాజెక్ట్స్ జోలికి పోకుండా కొరటాల 'దేవర 2' స్క్రిప్ట్ మీద కూర్చున్నాడట. ఇటీవల ఈ సినిమా స్క్రిప్ట్‌ను లాక్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ వర్స్ సైతం దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది.


ఇటీవల చిత్ర నిర్మాత సుధాకర్ మిక్కిలినేని 'దేవర 2' సినిమా ఖచ్చితంగా ఉంటుందని, త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందనేది కూడా ఖరారైందని చెబుతున్నారు. 'దేవర 2' షూటింగ్ మే నుంచి మొదలు పెట్టబోతున్నారట. అయితే... ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో భారీ మార్పులు జరిగాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యిందని తెలుస్తోంది. ఏదేమైనా... 'వార్‌ 2' పరాజయం తర్వాత ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్, అటు కొరటాల శివ చిత్రాల స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవసరమైతే షూటింగ్‌కు కొద్ది నెలలు విరామం ఇచ్చి, పకడ్బందీగా ఉండేలా చూసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సో... అన్ని జాగ్రత్తలూ తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు ఏ స్థాయి విజయాలను నమోదు చేసుకుంటాయో చూడాలి.

Updated Date - Mar 11 , 2026 | 03:03 PM