DELULU Teaser: ‘డెలులు’ టీజర్‌ విడుదల..

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:22 PM

యువతలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న ‘డెలులు’ అనే ట్రెండీ పదాన్నే టైటిల్‌గా ఎంచుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’.

యువతలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న ‘డెలులు’ అనే ట్రెండీ పదాన్నే టైటిల్‌గా ఎంచుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ అందించగా, రెష్మిత్ ఎస్. కౌశిక్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే యువతలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తాజాగా విడుదల చేసిన టీజర్‌తో మరింత చర్చనీయాంశమైంది.

ఒక నిమిషం 32 సెకండ్ల నిడివితో వచ్చిన టీజర్ పూర్తి స్థాయి ఫన్ రైడ్‌లా సాగింది. ‘బ్రేకప్ దేవా’ అంటూ మొదలయ్యే ఈ టీజర్‌లో యువత జీవనశైలి, ప్రేమ, బ్రేకప్‌లు, స్నేహాలు చుట్టూ తిరిగే సరదా సంఘటనలను హాస్యభరితంగా చూపించారు. పాత్రల మధ్య జరిగే చమత్కార సంభాషణలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

‘నువ్వేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘అత్తాపూర్‌కు రా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’ వంటి డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యే భాష, కామెడీ టైమింగ్ టీజర్‌కు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒక ఇంటి నేపథ్యంలో సాగే కథలో కుటుంబ బంధాలు, యువత ఆలోచనలు, ప్రేమ-బ్రేకప్‌ల చుట్టూ జరిగే సరదా పరిణామాలను చూపించినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. కేవలం యువతనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Sep 04 , 2026 | 09:22 PM