'సిద్ధార్థ్‌ రాయ్‌' హీరో మలి చిత్రం 'శ్రీ మహా విష్ణు'!

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:41 AM

బాలనటుడు దీపక్ సరోజ్‌ 'సిద్ధార్థ్‌ రాయ్‌' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అతను రెండో సినిమాగా రొమాంటిక్‌ లవ్ స్టోరీ 'శ్రీమహా విష్ణు' చేస్తున్నాడు. ఇందులో దీపక్‌ సరోజ్‌ పెయింటర్ పాత్రను పోషిస్తున్నాడు.

Srimaha Vishnu Movie

'సిద్ధార్థ్ రాయ్' చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీహరి తన్నీరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.


'శ్రీమహా విష్ణు' అనే టైటిల్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్‌ని ప్రజెంట్ చేస్తోంది. సున్నితమైన ఆయిల్ పెయింటింగ్ స్టయిల్‌లో అందంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'ప్రతి హృదయానికీ ఒక కథ ఉంటుంది' అనే ట్యాగ్‌లైన్ ఒక సున్నితమైన ప్రేమకథ ఉందని సూచిస్తుంది. 'శ్రీమహా విష్ణు' ప్రేమ, బాధ్యత, ఆత్మశోధన వంటి అంశాలను ప్రజెంట్ చేసే ఒక మంచి ప్రేమకథగా తెరకెక్కుతోందని, ఇందులో దీపక్ సరోజ్ ఒక యువ చిత్రకారుడి పాత్రను పోషిస్తున్నాడని, ఈ పాత్ర ఎమోషనల్ డెప్త్‌తో సరికొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

అత్యున్నత నిర్మాణ, సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు హరి హరన్ గోధగాని చెబుతూ, 'ఈ సినిమా నేటి ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలతో రూపొందింది. ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా సున్నితంగా తెలియజేస్తుంది' అని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేశ్‌ రగుతు సినిమాటోగ్రాఫర్‌. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత శ్రీహరి తన్నీరు తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 11:50 AM