D Suresh Babu: అది ఫిలిం ఇండస్ట్రీకి ఐకానిక్‌లా ఉండాలి
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:42 PM
ఛాంబర్ అనేది ఒక భవనాల సముదాయం కాకూడదు. సినిమా ఎలా పుడుతుంది? ఎలా రూపుదిద్దుకుంటుంది అన్నది కూడా చూపించే స్థలంగా మారాలి.
'ఛాంబర్ (Film Chamber)అనేది ఒక భవనాల సముదాయం కాకూడదు. సినిమా ఎలా పుడుతుంది? ఎలా రూపుదిద్దుకుంటుంది అన్నది కూడా చూపించే స్థలంగా మారాలి. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీకి (Film Nagar Housing society) చెందిన భవనం స్థానంలో టవర్ కట్టాలని అనుకుంటున్నారు. అందరి నిర్ణయం మేరకు అది జరిగి తీరుతుంది. అయితే, అది ఫిలిం ఇండస్ట్రీకి ఐకానిక్‌లా ఉండాలి' అని నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు (D Suresh babu) అన్నారు. తాజాగా అయన 'నవ్య'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఇది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రపంచం. మీ కంటెంట్ నచ్చకపోతే ప్రేక్షకుడు డబ్బులు చెల్లించడు. ఒకవేళ నచ్చితే ‘ధురంధర్’ లాగా రూ. 1000 కోట్లు ఇస్తాడు. ఈసారి సంక్రాంతి సీజన్‌లో ఏడు సినిమాలు వస్తున్నాయి. వారందరూ సంక్రాంతికే ఎందుకు వస్తున్నారంటే ఆ సమయంలో ప్రజలకు థియేటర్లకు వెళ్లే అలవాటు ఉంది. అయితే, ఓటీటీలు మునుపటిలా ఇప్పుడు భారీ ధరలకు సినిమాలు కొనడం లేదు. పెంచుకోవడం కోసం వారు సొంత వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి మనం వ్యాపారం చేయడానికి వచ్చాం. దానిని సరిగ్గా చేస్తే గెలుస్తాం. లేదంటే వృథా ప్రయాస అవుతుంది.
15రోజుల్లో ఒప్పందం
పైరసీ అనేది చాలా పెద్ద సమస్య. ఒకప్పుడు కెమెరా ప్రింట్స్ ద్వారా పైరసీ చేసేవారు. ఆ తర్వాత అత్యాధునిక టెక్నాలజీల ద్వారా పైరసీ చేయటం మొదలుపెట్టారు. దీని కోసం ఛాంబర్‌లో ఒక విభాగం ఉంది. కానీ సమస్య చాలా పెద్దది. దీనిని నలుగురైదుగురు కూర్చుని పరిష్కరించలేరు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయటం వల్ల ఇప్పటి దాకా వచ్చిన సినిమాలు లింకులు పోతాయి. అయితే కొత్తగా వచ్చే సినిమాల కెమెరా ప్రింట్స్‌ను పైరసీ చేయవచ్చు కదా. అందుకే ఇలాంటి సమస్యలన్నింటినీ అరికట్టడానికి రాష్ట్ర సైబర్ క్రైం విభాగంతో కలిపి పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నాం. సైబర్ క్రైం విబాగంతో ఛాంబర్ ఒక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఈ ఒప్పందంపై మరో 15 రోజుల్లో సంతకాలు చేస్తాం. దీని వల్ల పైరసీ చాలా వరకు అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం.
టూరిజం సర్క్యూట్‌గా..
ఛాంబర్ అనేది ఒక భవనాల సముదాయం కాకూడదు. సినిమా ఎలా పుడుతుంది? ఎలా రూపుదిద్దుకుంటుంది అన్నది కూడా చూపించే స్థలంగా మారాలి. మ్యూజియం, క్రియేటివ్ స్పేస్‌లు, ఫిల్మ్‌కేఫ్ లు ఉండాలి. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన భవనం స్థానంలో టవర్ కట్టాలని అనుకుంటున్నారు. అందరి నిర్ణయం మేరకు అది జరిగి తీరుతుంది. అయితే, అది ఫిలిం ఇండస్ట్రీకి ఐకానిక్‌లా ఉండాలి. దీనివల్ల ఫిలింనగర్ టూరిజం సర్క్యూట్‌గా కూడా మారుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తుందని నమ్ముతున్నాం.
ఛాంబర్ ప్రమేయం ఉండదు
‘బుక్ మైషో’లో వచ్చే రివ్యూల వల్ల తమకు నష్టం జరుగుతోందని కొందరు నిర్మాతలు భావిస్తున్నమాట నిజం. ఈ మధ్యకాలంలో కన్నడలో విడుదలయిన రెండు సినిమాలకు సంబంధించి రివ్యూలు పబ్లిష్ చేయకుండా అక్కడ నిర్మాతలు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నారు. మన నిర్మాతలు కూడా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు సంబంధించి అలాంటి కోర్డు ఆర్డర్లు తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఛాంబర్ ప్రమేయం ఏమి ఉండదు. నిర్మాతలు వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకోవాలి.