Vaaranaasi: స్పీడు పెంచిన రాజమౌళి.. సాంగ్ షూట్ మొదలు

ABN , Publish Date - May 23 , 2026 | 04:26 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తోన్న వారణాసి కోసం ఆల్ ఇండియాలో సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vaaranaasi

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తోన్న వారణాసి కోసం ఆల్ ఇండియాలో సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7వ తేదీన ఉగాది కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ఇప్పట్లో రాదని తెలిసినా, రాజమౌళి-మహేశ్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా సినీఫ్యాన్స్ వారణాసి నుండి ఏ న్యూస్ వెలుగు చూసినా ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి కోసం మహేశ్ బాబుపై ఓ పాటను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో ఈ పాట కోసం ఓ భారీ సెట్ ను రూపొందించారు. ఈ పాటను జనరంజకంగా తీర్చిదిద్దేందుకు జక్కన్న తనదైన శైలిలో కృషి చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిన కొద్దిరోజులకు రామోజీ ఫిలిమ్ సిటీలో వారణాసి టాకీ పార్ట్ మళ్ళీ మొదలు కానుంది.


వారణాసి చిత్రంలో ఓ అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది. దానిని చిత్రీకరించడానికి కొన్ని వందల వాటర్ ట్యాంకర్స్ నీరు అవసరం. ఈ విషయంలో నీటి కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ వారి సాయం కోరింది వారణాసి యూనిట్... అయితే వేసవిలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, ఈ నేపథ్యంలో వాటర్ సప్లై చేయలేమని కార్పోరేషన్ వారు తేల్చి చెప్పారు. దాంతో మళ్ళీ వారణాసికి వెళ్ళి అక్కడే అండర్ వాటర్ సీక్వెన్స్ ను రూపొందించారు. అక్కడ నుండి వచ్చాక మహేశ్ బాబుపై పాటను మొదలెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరుకు వారణాసి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి యూనిట్ ను సన్నద్ధం చేసినట్టు తెలుస్తోంది.


వారణాసి చిత్రాన్ని అత్యంత భారీవ్యయంతో నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 125 దేశాల్లో వారణాసి చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న సంకల్పంతో సాగుతోంది యూనిట్. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసమే దాదాపు ఆరు నెలలు శ్రమించాల్సి ఉంటుందని సమాచారం. అందువల్లే ఆగస్టుకు మొత్తం షూటింగ్ పూర్తి చేసి, తరువాత పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టనుంది యూనిట్... జనవరి నెలాఖరుకే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వారణాసి బృందం ఉంది. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందుగానే కొన్ని ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తారనీ తెలుస్తోంది. అందుకోసమే ఇంత హంగామా అన్న మాట! మరి వారణాసి సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులను ఏ తీరున మెప్పిస్తుందో చూడాలి.

Updated Date - May 23 , 2026 | 04:37 PM