విశ్వక్‌సేన్ : అలా అయితే బాబాజీ అయ్యేవాడిని కదా! '
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:05 PM
‘సినిమా హిట్ అవుతుందా? పోతుందా? ఎంత వసూళ్లు వస్తాయనేది తెలిస్తే నేను బాబాజీ అయ్యేవాడిని.ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు.
‘సినిమా హిట్ అవుతుందా? పోతుందా? ఎంత వసూళ్లు వస్తాయనేది తెలిస్తే నేను బాబాజీ అయ్యేవాడిని.ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు. ఏ సినిమాకి అయినా మంచి ఫలితం రావాలని ప్రాణం పెట్టే పని చేస్తాం' అని విశ్వక్‌సేన్ అన్నారు. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కల్ట్'. శనివారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ వేదికపై సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు విశ్వక్ ఖరీదైన రోలెక్స్ గోల్డ్ వాచ్ ఇచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వక్ మాట్లాడుతూ 'ఫలక్‌నుమా దాస్' సినిమాకి ముందు ఏదో సాధించాలన్న కసితో ఉండేవాడిని. ‘కల్ట్’ సినిమాకు ముందు ఆ కసి పది రేట్లు పెరిగింది. ఆ కసితోనే ఈ సినిమా తీశాను. టీజర్‌లో ప్రేక్షకులు చూసింది చాలా తక్కువ. పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచండి. గుండె బలహీనంగా ఉన్నవారు ఈ సినిమాకు రావొద్దు. చాలా మంది నేను ఏమీ గమనించడం లేదనుకుంటారు. సోషల్‌మీడియాలో ట్రెండింగ్ లో ఏమున్నాయో అన్ని చూస్తూనే ఉంటా. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అన్నీ మిక్సీలో వేసి తీసిన సినిమానే ఇది. 'కల్ట్' మాత్రం జానర్ బ్రేకింగ్ ఫిల్మ్. జెన్‌జీకి బాగా నచ్చుతుంది. న్యూఏజ్ కోసం సినిమా చేయాలని లెక్కలు లేకుండా చేశా. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు ఒక కన్ను, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మరో కన్ను. జనం మెచ్చే సంగీతం ఇచ్చాడు. అందుకే ఆయన కోసం రెండేళ్లు వెయిట్ చేసి రోలెక్స్ గోల్డ్ వాచ్ తెప్పించాను’ అని అన్నారు.
'25ఏళ్ల కెరీర్‌లో నాలో అసలైన మ్యూజిక్ డైరెక్టర్‌ను విశ్వక్ గుర్తించాడు. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు. సంగీత దర్శకులకు దక్కిన గౌరవం' అంటూ రవి బస్రూర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాట్లాడుతూ 'నాకు 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా. ఎలాగోలా బతికి బయటపడ్డాను. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీ-బోర్డ్ కొనుక్కోమని రూ.35వేలు ఇచ్చారు. ఆయన పేరు రవి. అప్పటి నుంచి నా సొంత పేరును తీసేసి రవి బస్రూర్‌గా అని పెట్టుకున్నా. నా చివరి క్షణం వరకు మీరందరూ నన్ను రవి బస్రూర్ అని పిలుస్తారు కదా! ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇప్పుడు విశ్వక్ నా ప్రతిభను గుర్తించాడు. వీరిద్దరిని నా జీవితంలో మర్చిపోలేను’ అని అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ 'ఈవెంట్ ని చూస్తుంటే మళ్ళీ కాలేజీకి వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా కోసం విశ్వక్సేన్ ఏది చెప్తే అది విన్నాను . ఈ సినిమా కల్ట్, రెస్పాన్స్ కల్ట్, కలెక్షన్స్ కల్ట్, విశ్వక్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఉంది' అన్నారు