Santhosh Sobhan: 'గాబరా గాబరా' అవుతున్న 'కపుల్ ఫ్రెండ్లీ'...
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:39 PM
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా లిరికల్ వీడియో విడుదలైంది.
సంతోష్ శోభన్ (Santhosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటిస్తున్న సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly). యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దీనికి దర్శకత్వం వహించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా బుధవారం 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ నుండి 'గాబరా గాబరా' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి రచన చేయగా, ఆదిత్య రవీంద్రన్ స్వరాలు సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ దీనిని పాడటం విశేషం. 'గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం, కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం, బంతి భోజనంలో బంతిని వడ్డిస్తారా, చేపను వేపాక చెరువులో వేస్తారా, సంబంధం లేని పనులనే, చేస్తున్నాం సిగ్గే పడకనే, చెత్త చేరింది లోనే' అంటూ కలిసి రాని లైఫ్ కు ఫేట్ ఇచ్చే ట్విస్టులను ఈ పాటలో పొందుపరిచారు.