జాతీయ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్లు' రచ్చ.. ఏకంగా రెండు అవార్డులు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:19 PM

భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన వెలువడింది. ఈ అవార్డులలో టాలీవుడ్‌కు చెందిన ఒక చిన్న చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.

Committee Kurrollu

భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన వెలువడింది. ఈ అవార్డులలో టాలీవుడ్‌కు చెందిన ఒక చిన్న చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఒకటి కాదు ఏకంగా రెండు అవార్డులను అందుకొని ఇండస్ట్రీని షేక్ చేసింది. 2024 ఏడాదికి గాను ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు కూడా కమిటీ కుర్రోళ్లు సినిమాకు పనిచేసిన పి. రవికుమార్ కి దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డ్ కొట్టేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


మెగా కూతురు నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. కొత్త నటీనటులతో, పల్లెటూరి నేపథ్యంలో స్నేహం, రాజకీయం, భావోద్వేగాల చుట్టూ సాగే అద్భుతమైన కథాంశంతో దర్శకుడు యదు వంశీ (Yadhu Vamsee) ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. జాతీయ అవార్డుల జ్యూరీని సైతం ఈ చిత్రం ఎంతగానో మెప్పించడంతో ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది.


పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, కంటెంట్ ఉన్న చిన్న సినిమాను జాతీయ అవార్డు వరించడం విశేషం. దర్శకుడు యదు వంశీ ప్రతిభకు, నిహారిక కొణిదెల నిర్మాణ విలువలకు దక్కిన అరుదైన గౌరవంగా సినీ విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే గద్దర్ అవార్డ్స్ లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా యదువంశీ గద్దర్ అవార్డ్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా జాతీయ అవార్డును అందుకోవడంతో కంటెంట్ ఉన్న సినిమాలకు స్టార్స్ అవసరం లేదని మరోసారి రుజువైందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 06:21 PM