Prabhas: చార్మినార్‌కు.. వ‌స్తోన్న 'ఫౌజీ'

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:37 AM

ఒకప్పుడు హైదరాబాద్ అనగానే 'చార్మినార్'ను ఐకాన్‌గా చూపించే వారు. చార్మినార్ చెంత అనేక తెలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఒరిజినల్ చార్మినార్ దగ్గర ఇప్పుడు కంటిన్యూగా షూటింగ్స్ జరపలేని పరిస్థితి. అందువల్ల స్టార్స్ మూవీస్ కోసం స్పెషల్ చార్మినార్స్ వెలుస్తున్నాయి. తాజాగా మరోమారు చార్మినార్ సెట్ వెలిసింది. ఆ ముచ్చటేంటో చూద్దాం.

prabhas fauzi

ఒకప్పుడు హైదరాబాద్ వచ్చిన సందర్శకులు చార్మినార్‌ను తప్పనిసరిగా చూసేవారు. అలాగే ఆ నాటి తెలుగు వారి రాజధాని అయిన హైదరాబాద్‌లో షూటింగ్ అనగానే చార్మినార్ (Charminar) ను ఏదో ఒక సన్నివేశంలో చొప్పించే వారు. 400 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న చార్మినార్ చెంత ఇప్పుడు రోజుల తరబడి షూటింగ్స్ జరిపే పరిస్థితి లేదు. అందునా స్టార్ హీరోస్ నటించే సినిమాల షూటింగ్ కు అసలు పర్మిషనే ఉండదు. ఈ నేపథ్యంలోనే 2003లో మహేశ్ బాబు నటించిన 'ఒక్కడు' కోసం అప్పట్లో గోపనపల్లెలో చార్మినార్ సెట్ వేశారు. దాదాపు 23 ఏళ్ళ తరువాత ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం ఫౌజీ (Fauzi) కోసం మరోమారు చార్మినార్ సెట్‌ను రూపొందించారు. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను నిర్మాత రవిశంకర్‌ ‘చిత్రజ్యోతి’తో పంచుకున్నారు.

‘ప్రస్తుతం కోకాపేటలోని ఓ టెంపుల్‌లో ‘ఫౌజీ’లోని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దాదాపు 20 రోజుల నుంచి చిత్రీకరిస్తున్న ఈ ఫైట్‌లో ప్రభాస్‌, బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ పాల్గొంటున్నారు. సినిమాలో చాలా కీలకమైన ఫైట్‌ ఇది. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 13వ వరకూ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున వేసిన చార్మినార్‌ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ‘బాహుబలి’ తదితర చిత్రాలకు పని చేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అనిల్‌ విలాస్‌ జాదవ్‌ ఈ సెట్‌కు రూపకల్పన చేశారు. ఆ తర్వాత ఈ నెల 26 వరకూ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది. ఏకధాటిగా 25 రోజులు షూటింగ్ జరుపుకొనే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు పలువురు ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఈ షెడ్యూల్ తో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ రీ రికార్డింగ్‌ పనులు మొదలు పెట్టాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని చెప్పారు.

'ఒక్కడు' లాగే..

హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్‌తో 'ఫౌజీ' చిత్రాన్ని మూవీమేకర్స్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఇమాన్వీ, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన అజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో 'ఫౌజీ' రూపొందుతోంది. దాదాపు 700 కోట్ల వ్యయంతో ఈ పీరియడ్ డ్రామా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ నాడు వీరసైనికులు చార్మినార్ సమీపంలో చేసిన సాహసాలు ఈ చిత్రకథలో ప్రధాన భూమిక పోషించాయట. అందువల్లే చార్మినార్ సెట్ ను రూపొందించవలసి వచ్చింది. చాలా రోజులు షూటింగ్ జరపాల్సిన అవసరం రావడంతో ఏకంగా చార్మినార్ ప్రతిబింబంలా సెట్ ను రూపొందించారు మేకర్స్. గతంలో చార్మినార్ సెట్ నేపథ్యంలో రూపొందిన మహేశ్ 'ఒక్కడు' సినిమా బంపర్ హిట్ గా నిలచింది. అదే తీరున 'ఫౌజీ' కూడా జనాన్ని ఆకట్టుకుంటుందనే సెంటిమెంట్ ప్రచారమవుతోంది.

డిసెంబర్ 3నే 'ఫౌజీ' రాక..

ముందుగా ప్రకటించిన ప్రకారం 'ఫౌజీ' చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మధ్య కొందరు అనుకున్న తేదీకి 'ఫౌజీ' రాకపోవచ్చునని ప్రచారం చేశారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ఈ విషయాన్ని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 3వ తేదీన 'ఫౌజీ' చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో విడుదలైన ప్రభాస్ 'ద రాజాసాబ్' తీవ్ర నిరాశను మిగిల్చింది. దానిని రూపుమాపుతూ 'ఫౌజీ' మంచి విజయం సాధిస్తుందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. మరి చార్మినార్ సెట్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా తెరకెక్కుతోన్న 'ఫౌజీ' అనకున్న తేదీకే జనం ముందుకు వస్తుందేమో చూడాలి.

Updated Date - Aug 05 , 2026 | 06:55 AM