Anaswara Rajan: ఆ సినిమా రీ-రిలీజ్ రోజు ఫ్లైట్‌ మిస్‌ అయినా పర్వాలేదనుకున్నా..

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:28 AM

ఛాంపియన్‌ సినిమాతో గతేడాది టాలీవుడ్‌కు పరిచమైన అనస్వర రాజన్‌... ‘ఇట్లు అర్జున’ అంటూ మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

ఛాంపియన్‌ సినిమాతో గతేడాది టాలీవుడ్‌కు పరిచమైన అనస్వర రాజన్‌... ‘ఇట్లు అర్జున’ అంటూ మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనస్వర.. ఇప్పుడు తెలుగులోనూ బిజీ అయింది. మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే చాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత ఇష్టాలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి స్వయంగా పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...

నేను పుట్టింది కేరళలోని కణ్ణూర్‌ జిల్లా, కరివెల్లూరు అనే చిన్న ఊరిలో. చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఆసక్తి. 2017లో ‘ఉదాహరణం సుజాత’ చిత్రంతో బాలనటిగా నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ, నటిగా నన్ను యూత్‌లో నిలబెట్టిన సినిమా మాత్రం ‘తన్నీర్‌మథన్‌ దినంగల్‌’. ఆ సినిమా తర్వాత నా కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. ‘సూపర్‌ శరణ్య’, ‘ప్రణయ విలాసం’ వంటి చిత్రాలు వరుసగా విజయాలు అందుకోవడంతో మలయాళంలో నాపై నమ్మకం పెరిగింది.

నటిగా మలుపుతిప్పిన ‘నేరు’

నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ‘నేరు’ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. లెజెండరీ నటుడు మోహన్‌లాల్‌ సర్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆ చిత్రంలో నేను అంధురాలి పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. నా నటన చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నా కష్టం ఫలించిందనిపించింది. విమర్శకులు నా నటనను మెచ్చుకోవడమే కాకుండా, ఫిలింఫేర్‌ అవార్డు కూడా రావడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

Fragments; 🪕Stylist- @kalyanik666 Mua- @bobbykasara Hair- @prakash_kasara Jewellery- @the_jewel.jpg

‘ఇట్లు అర్జున’తో తెలుగులో మలి అడుగు

మలయాళంలో మంచి అవకాశాలు వస్తున్నా, ఇతర భాషల్లో కూడా నన్ను నేను నిరూపించుకోవాలని ఉండేది. ఆ సమయంలో నాకు వచ్చిన కథే ‘ఇట్లు అర్జున’. నిజానికి తెలుగులో నేను మొదట అంగీకరించిన సినిమా ఇదే. ఆ తర్వాతే ‘ఛాంపియన్‌’కి ఓకే చెప్పాను. కొన్ని కారణాల వల్ల ‘ఇట్లు అర్జున’ విడుదల ఆలస్యమైంది. అయినా, ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఈ నెల 13న మీ ముందుకు రాబోతోంది. ఇందులో నా పాత్ర పేరు ‘కీర్తి’. ఇది ప్రతి అమ్మాయి తన జీవితంలో చూసే, ఎదుర్కొనే సంఘటనలకు దగ్గరగా ఉంటుంది. దర్శకుడు మహేశ్‌ కథ చెబుతున్నప్పుడే ఆ పాత్రతో ప్రేమలో పడిపోయాను.

మాటలు లేని హీరోతో..

ఈ సినిమాలో హీరో అనీష్‌ ఒక్క మాట కూడా మాట్లాడడు. ఒక కొత్త హీరో తన తొలి సినిమాకే ఇంతటి ప్రయోగాత్మక పాత్రను ఎంచుకోవడం నిజంగా సాహసం. అతనితో కలిసి నటించడం నాకు ఒక కొత్త అనుభవం. మాటల్లేకుండా కేవలం హావభావాలతో నటించడం కష్టం. అందుకే, మేమిద్దరం కలిసి కొన్ని వర్క్‌షాప్స్‌ చేశాం. అతని హావభావాలకు, నా డైలాగ్‌ టైమింగ్‌కు మధ్య సమన్వయం కుదిరేలా ప్రాక్టీస్‌ చేశాం. అనీష్‌ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. మా సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేస్తూ అనీష్‌ ధైర్యాన్ని, నా నటనను మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

తెలుగు పరిశ్రమ.. ఓ పెద్ద ప్రపంచం

మలయాళంతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. ఇక్కడికి వస్తున్నప్పుడు మొదట నాలో కొంచెం భయం, గందరగోళం ఉండేవి. భాష కొత్త, వాతావరణం కొత్త. కానీ, సెట్‌లో అందరూ నాకు ఎంతో సహకరించారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఆరాధించే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా మొదటి సినిమాకే నాగార్జున సర్‌ సమర్పకుడిగా ఉండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈసారి దీపావళిని కూడా హైదరాబాద్‌లోనే ‘ఇట్లు అర్జున’ టీమ్‌తో కలిసి జరుపుకోబోతున్నాను.


Ana-2.jpg

ట్రోలింగ్స్‌ పట్టించుకోను

కెరీర్‌ మొదట్లో సోషల్‌ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్‌ చూసి చాలా బాధపడేదాన్ని. కానీ, రానురాను వాటిని పట్టించుకోవడం మానేశాను. నా దృష్టి అంతా మంచి కథలు, పాత్రల మీదే ఉంటుంది. ఇక నా వ్యక్తిగత ఇష్టాల విషయానికొస్తే, నేను అల్లు అర్జున్‌కి పెద్ద అభిమానిని. చిన్నప్పుడు ఆయన డబ్బింగ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇటీవల ‘హ్యాపీ’ సినిమా రీ రిలీజ్‌ అయినప్పుడు.. నా ఫ్లైట్‌ మిస్‌ అయినా పర్వాలేదని థియేటర్‌కు వెళ్లి సినిమా చూశానంటే మీరే అర్థం చేసుకోండి. మలయాళంలో నన్ను ఆదరించినట్టే, తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను, నా ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమతో టాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనుకుంటున్నాను.

చిరంజీవి, రవితేజలతో ప్రయాణం

‘ఇట్లు అర్జున’తో పాటు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి సర్‌ ‘కాకా’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం ఒక కల నిజమైనట్లుంది. సెట్‌లో ఆయన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. అలాగే, మాస్‌ మహారాజా రవితేజ సర్‌ ‘తులాభారం’లో కూడా నటిస్తున్నాను. ఇందులో నేను హీరోయిన్‌ కాకపోయినా, కథను మలుపుతిప్పే కీలక పాత్ర నాది. వీటితో పాటు సంగీత్‌ శోభన్‌తో కలిసి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాను.

ALSO READ:

Diwali: అమ్మతో అనుబంధం.. మట్టి దీపాల అందం.. తారల దీపావళి విశేషాలు

Nayanthara: నయనతారకు వరుస షాకులు.. ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్!


‘భోగి’ ఈవెంట్ వాయిదా.. ఆ చిక్కే కారణమా




Updated Date - Nov 08 , 2026 | 08:49 AM