D Suresh Babu: ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం? అవి లాభదాయకమేనా..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:26 AM
ఒకప్పుడు సినిమా అనేది కుటుంబంతో కలిసి ఆస్వాదించే పండుగ. థియేటర్ బయట హడావుడి.. లోపల చీకటి.. తెరపై వెలుగు. ఇదే అనుభవం. కానీ ఇప్పుడా అనుభవం నెమ్మదిగా ఒంటరితనంగా మారుతోంది.
ఒకప్పుడు సినిమా (Tollywood) అనేది కుటుంబంతో కలిసి ఆస్వాదించే పండుగ. థియేటర్ బయట హడావుడి.. లోపల చీకటి.. తెరపై వెలుగు. ఇదే అనుభవం. కానీ ఇప్పుడా అనుభవం నెమ్మదిగా ఒంటరితనంగా మారుతోంది. మొబైల్ స్క్రీన్ లో హెడ్‌ఫోన్‌ల మధ్య వినోదం కొత్తరూపం తీసుకుంటోంది. దీంతో థియేటర్లలో సినిమా చూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే వ్యాపార సంస్థగా సినీ పరిశ్రమ అంతర్గత మార్పులు చేసుకోవాలని అంటారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు. తాజాగా ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ‘నవ్య’తో మాట్లాడారు.
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి?
సినీ పరిశ్రమలోని వ్యవస్థలో ప్రధానంగా క్రమశిక్షణ రావాలి. చాంబర్ ఎన్నికలు నిర్ణీత వ్యవధిలో జరగాలి. అది గతంలో సరిగ్గా జరగలేదు. అందుకే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని భావించాను. మాది రాజకీయ సంస్థ కాదు. ఇక్కడ జరిగేవన్నీ వ్యాపార నిర్ణయాలే. అందుకే నేను ఇండస్ట్రీ విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడను. వ్యాపారం అన్నప్పుడు నాలుగు రంగాల (నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు, స్టూడియోలు) వారితో మాట్లాడి సమస్యలను సరిదిద్దాలి. మన వ్యాపారంలో వృద్ధి ఉందా? అంతర్గతంగా ఏవైనా మార్పులు చేసుకోవాలా? లేదంటే ప్రభుత్వ మద్దతు ఏమైనా అవసరమా? అనేవి ఆలోచించాలి. చిత్రపరిశ్రమ ఇప్పుడు సంధికాలంలో ఉంది. ఇక్కడేకాదు, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది.
థియేటర్లలో వస్తున్న మార్పుల ప్రభావం ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు 3 వేల థియేటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1500 నుంచి 1700 స్క్రీన్ లకు పడిపోయింది. జనాభా పెరుగుతున్నా థియేటర్లు, సీట్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్ ఎ-టౌన్, బి-టౌన్, సి-టౌన్ అని మూడు వర్గాలుగా విడిపోయింది. వ్యాపారస్తులుగా మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం? అవి లాభదాయకమేనా? అని ఆలోచించాలి. లేదంటే సినిమా ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం అవుతుంది. మిగిలినవారు టీవీలకు అతుక్కుపోతారు. మరోవైపు, పంపిణీదారుల పాత్రా మారుతోంది. నిర్మాతలు కూడా తాము కేవలం థియేటర్ల కోసమే సినిమాలు తీస్తున్నామా?లేదంటే ఇతర ప్లాట్‌ఫామ్స్ మీద ఆధారపడుతున్నామా? అనేది తేల్చుకోవాలి. పరిశ్రమను కాపాడాలంటే సమష్టి ఆలోచన, కార్యాచరణ అవసరం. తాత్కాలిక లాభాల కోసం కాకుండా, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే థియేటర్ నిలబడుతుంది.
నేటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్ మారుతోందా?
నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్ మన నిద్రతో పోటీపడుతున్నాయి. వారు కంటెంట్‌ను మీ ఇంటి వద్దే, మీకు నచ్చిన సమయంలో అందిస్తున్నారు. సినిమా అనేది ఒక సామూహిక అనుభవం. దానిని కాపాడుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాలు. కంటెంట్ విషయానికి వస్తే ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ వంటి సినిమాల విజయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందులోని దేశభక్తి, మన నమ్మకాలు ప్రేక్షకులకు నచ్చాయి. గతంలో మనోజ్‌కుమార్ సినిమాల్లో ఒకరకమైన దేశభక్తి ఉండేది. ఇప్పుడు అది మరో రూపంలో ఉంది. రిషభ్‌శెట్టి కాంతార ద్వారా తన ప్రాంతీయ సంస్కృతిని అందంగా చూపించారు. కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’ ద్వారా మన కళను ఎలా చూపించారో, నేటితరం దర్శకులు కూడా తమకు తెలిసిన ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
సోషల్ మీడియా నుంచి వస్తున్న పోటీని ఎలా ఎదుర్కోవాలి?
సోషల్ మీడియా అనేది ఒక కొత్త మాధ్యమం. భార్యాభర్తలు చిన్నచిన్న జోకులు వేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆ వీడియోలు చూస్తూ నేను కూడా గంటల తరబడి గడుపుతున్నాను. అంత వినోదం ఇంట్లోనే దొరుకుతున్నప్పుడు ప్రేక్షకుడు థియేటర్‌కు ఎందుకు వస్తాడు. మరో 10-15 ఏళ్లలో కొత్తతరం సినిమాల గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. వారు గేమింగ్‌లో మునిగిపోతారు. మనం ఇప్పటికీ హీరో వర్షిప్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో పిల్లలు తమ సొంత వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే జీవిస్తారు.
సమాజంలో అలవాట్లు ఎలా మారుతున్నాయి?
40-50 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలు సిగరెట్లు తాగుతారేమోనని భయపడేవారు. కానీ, ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ అలవాటు చేసుకుంటారోనని భయపడుతున్నారు. ఈ మార్పులకు కారణం కూడా ఒక వ్యాపార సంస్థే. ఎవరో ఒకరు వీటిని మార్కెట్లోకి పుష్ చేస్తున్నారు. మరెవరో దీనిని వినియోగిస్తున్నారు. ఇది పాతకాలం నుంచి ఉన్నదే. మనం చూసే కోణం మారిందంతే.
ఒకేరకమైన సినిమాలు వస్తున్నాయన్న విమర్శ ఉంది కదా...
ఎప్పుడైనా ఒకే తరహా సినిమాలు విజయం సాధించినప్పుడు మిగతా వారు కూడా అలాంటి సినిమాలనే నిర్మిస్తారు. గతేడాది సంక్రాంతికి హాస్య ప్రధానమైన సినిమాలు వచ్చి విజయం సాధించాయి. అందుకని ఈసారి అందరూ పొలోమంటూ మరో జానర్‌పై పడ్డారు. అలాగని అందరూ ఆలాగే తీస్తున్నారని చెప్పలేం కానీ, చాలామంది అదే ఫాలో అవుతున్నారు.