Ajay Arasada: నా వర్క్ చూసి పవన్ కళ్యాణ్ పిలిచారు..
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:14 PM
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కలవడం ప్రత్యేకమైన అనుభవం. జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను.
''ఈ మధ్యనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారిని కలవడం ప్రత్యేకమైన అనుభవం. జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను. నా వర్క్ చూసి నన్నుపవన్ నన్ను పిలిపించారు. దాదాపు అరగంట పర్సనల్‌గా మాట్లాడారు. భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చెప్పారు. నాతో జోకులు వేశారు. ఎప్పటికి మరువలేని అనుభూతి ఇది'' అని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ (Ajay Arasada) అన్నారు. ‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. పదేళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
మాది వైజాగ్, మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉన్నాయి. టీసీఎస్‌లో ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ నాకు స్ఫూర్తి. నా ఫ్రెండ్ శ్రీచరణ్ ద్వారా ‘గూఢచారి’కి కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అలా ఒక్కో మెట్టు ఎక్కాను. చిన్న సినిమాలకు పనిచేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు న్యాయం చేయాలని చూస్తాను. అన్ని రకాల జానర్స్‌లో పనిచేయాలనుకుంటున్నాను. కథ మాస్‌గా ఉంటే మాస్ మ్యూజిక్, కథకు తగ్గట్టుగా మెలోడీ, ప్రయోగాత్మక సంగీతం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఏఐ.. అలా అనుకుంటే పొరపాటే..
థియేటర్ కోసం చేసే మ్యూజిక్, ఓటీటీకి వచ్చే మ్యూజిక్‌లో చాలా తేడా ఉంటుంది. థియేటర్ అనుభూతి కోసం మేం ప్రత్యేకంగా సౌండ్, స్కోర్‌పై పనిచేస్తాం. కానీ ఓటీటీలోకి వచ్చేసరికి దాని ప్రభావం తగ్గిపోతుంది. ‘వికటకవి’ని థియేటర్‌లో చూస్తే సౌండింగ్ మరో స్థాయిలో ఉంటుంది. మ్యూజిక్‌పై ఏఐ ప్రభావం ఇప్పటివరకు పెద్దగా లేదు. ఏఐని ఉపయోగించి టెక్నీషియన్ తన పనిని సులభం చేసుకోవచ్చు. కానీ ఏఐని ఉపయోగించి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చని మాత్రం అనుకోకూడదు.
నమ్మకం పెరిగింది..
నిజానికి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్‌కు పిలిచారని తెలిసినప్పుడు ఐదారు నిమిషాలు మాట్లాడి ఫొటో దిగి వచ్చేయవచ్చు అనుకున్నాను. కానీ ఆయన ఒక్కరే ఉండి చాలా విషయాలు చర్చించారు. నా దగ్గర ఉన్న కాఫీ మగ్ ఆకారంలోని బోస్ స్పీకర్ చూసి సరదాగా జోక్స్ కూడా చేశారు. ఆయన అలా నాతో సరదాగా మాట్లాడటంతో లోలోపల చాలా సంతోషపడ్డాను. నేను బయట ఎక్కువగా కనిపించను. నేను ఇంట్రోవర్ట్‌ని. నా పని గురించి నేనే చెప్పుకోవడం, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. పదేళ్ల ప్రయాణంలో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. పెద్ద కమర్షియల్ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతం అందించగలననే నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా సరైన అవకాశం.