Meenakshi Chaudhary: ఆ రోజు ఫన్నీగా చెప్పిన మాటను వైరల్ చేసేశారు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:53 AM
‘వృషకర్మ’ సినిమా షూటింగ్లో నిద్రలేని రాత్రులు గడిపానని మీనాక్షి చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలు, పెళ్లి, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తెరపై గ్లామర్‌తో మెప్పించే మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)... తాజాగా ‘వృషకర్మ’లో (Vrusha Karma) అడ్వెంచర్ క్వీన్‌గా కనిపించనుంది. గుహల్లో దాగిన రహస్యాలు... నిధి వేటలో... హీరో నాగచైతన్యతో పాటు ఉత్కంఠభరిత ప్రయాణం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న సరదా కబుర్లివి...
సరికొత్త సవాలు
‘వృషకర్మ’ నాకు కొత్త అనుభవం. ఎందుకంటే ఈ సినిమాలో సీజీ, వీఎఫ్ఎక్స్, గ్రీన్ స్ర్కీన్ టెక్నాలజీని ఉపయోగించారు. గ్రీన్‌స్క్రీన్ ముందు ఊహాజనిత ప్రపంచాన్ని ఊహించుకొని భావోద్వేగాలను పలికించడం కొత్త సవాలు. ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు ప్రేక్షకుల్లో వచ్చే స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
అదొక్కటే ఇబ్బంది...
‘వృషకర్మ’ కథని నాకు రెండు రోజుల పాటు చెప్పారు. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు. కాకపోతే ఈ సినిమా అంతా నైట్షూట్స్లోనే జరిగింది. అదొక్కటే ఇబ్బంది కలిగించింది. సాధారణంగా రోజూ నేను 10 నుంచి 14 గంటల పాటు నిద్రపోతా. ఈ సినిమా నాకు నిద్ర లేకుండా చేసింది. నిద్రలేని రాత్రులు గడిపా.
ఆలోచనల్ని రాసుకుంటా...
నా మైండ్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే వాటన్నింటినీ ఒక బుక్‌లో రాస్తుంటా. పుస్తకం అందుబాటులో లేకపోతే ఫోన్లో సేవ్ చేస్తుంటా. నేను ఇంట్రావర్ట్‌ని. నా జీవితం అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏదో కోల్పోయిన ఫీల్ ఉంటుంది. అందరూ సన్నిహితంగా ఉన్నా... ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ప్రకృతితో మమేకం
ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెల్ వ్లాగ్స్ చేయడం ఓ సరదా. బయట ప్రపంచం గురించి తెలియడం, తెలుసుకోవడం నచ్చుతుంది. ఎప్పటికైనా స్కై డైవింగ్ చేయాలని ఉంది. జిమ్‌కే పరిమితం కాకుండా... ప్రకృతిలో సమయం గడుపుతా.

స్వేచ్ఛ కోసం పోరాడుతా...
సోషల్ మీడియా, ఇంటర్నెట్లో నా పేరు, ఫొటోలను ఉపయోగించి... అసభ్యకరమైన, లైంగికపరమైన కంటెంట్ ప్రచారం చేస్తున్నారు. దీని గురించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించా. నాకు అక్కడ న్యాయం జరిగింది. ఇకపై ఎక్కడా నా ఫొటోలను వాడొద్దని కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎంతకైనా పోరాడుతా.
లక్ష్యాలున్నాయి...
నా జీవితంలో మొదటి నుంచీ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నా. వాటిని చేరుకోవడం పైనే నా దృష్టంతా. కార్యసాధనలో ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ... ఏవీ నా ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. ఎవరేమనుకున్నా నేను పట్టించు కోను. ముందుకు సాగుతూనే ఉంటా.
ఫన్నీగా చెప్పాను కానీ...
నాకు కాబోయేవాడు నటుడు, డాక్టర్, మిస్టర్ ఇండియా అవ్వకూడదు. ఇంట్లో మళ్లీ అవే ప్రొఫెషన్లు ఉంటే బోర్ కొడుతుంది. నాకు కాబోయేవాడికి కనీసం 100 ఎకరాల పొలం ఉండాలి. వంట చేయడం, బట్టలుతకడం, ఐరన్ చేయడం వంటి పనులు చేయాలి. అతనికి ఇంతకుముందే బ్రేకప్స్ ఉన్నా అభ్యంతరం లేదు... ఇలా నేను ఒక ఈవెంట్లో చెప్పా. ఈ మాటలు బాగా వైరలయ్యాయి. నేను కేవలం ఫన్నీగా చెప్పానంతే! వాటిలో కొన్నే నిజాలున్నాయండోయ్.