Mamitha Baiju: పెళ్లి విషయంలోనూ అన్నయ్య మాటే ఫైనల్
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:38 AM
‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాదిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మమితా బైజు. వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా మారిందీ మలయాళ ముద్దుగుమ్మ.
‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాదిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మమితా బైజు. వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా మారిందీ మలయాళ ముద్దుగుమ్మ. ఒకే నెలలో మూడు భాషల్లో, భారీ ప్రాజెక్టులతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వస్తోంది. వాటిల్లో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా ఉంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి...
దూరం... దూరం...
డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటిదాకా నా సినిమా అప్‌డేట్స్‌ను నేరుగా సోషల్ మీడియాలో పంచుకున్నా. ఇకపై నాకు సంబంధించిన విశేషాలను కేవలం నా పీఆర్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుంది. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కన్నా... నాకు మానసిక ప్రశాంతత ముఖ్యమనుకుంటున్నా.
పెద్ద ఫ్యాన్‌ని...
అల్లు అర్జున్‌కి డైహార్డ్ ఫ్యాన్‌ని. ఆయన ప్రతీ సినిమాను కనీసం పదిసార్లు రిపీట్ మోడ్‌లో పెట్టుకొని మరీ చూస్తుంటా. ఒకానొక సమయంలో బన్నీపై నాకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన ‘ఇద్దరమ్మాయిల్లో’ని క్యాసియో వాచ్‌లు చూసి... వాటిని నేనూ పెట్టుకొని తిరిగేదాన్ని. కొన్ని సినిమాల్లో ఆయన ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకొన్నారు. నేను కూడా అలాగే వేసుకొని టామ్‌బాయ్‌లా తిరిగేదాన్ని.
బేబీ డాక్టర్‌గా...
మాది కేరళలోని కొట్టాయం. నాన్న బైజు కృష్ణన్. ఆయనొక డాక్టర్. కుదిరినప్పుడు నన్ను తన క్లినిక్‌కి తీసుకెళ్లేవారు. అక్కడికి వచ్చినవారంతా బేబీ డాక్టర్ అని పిలిచేవాళ్లు. అప్పుడే డాక్టర్ కావాలనుకొనేదాన్ని. ఆ ఆసక్తితోనే సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశా. కానీ సినిమాల కారణంగా చదువు కొనసాగించలేకపోయా. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నా. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక దర్శకుడు చూసి నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

అంతా అన్నయ్యే...
మా అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్. మేమిద్దరం క్లోజ్‌ఫ్రెండ్స్‌లా ఉంటాం. నా విషయంలో ఏ నిర్ణయం అయినా తను తీసుకోవాల్సిందే! చివరకి నా పెళ్లి విషయంలోనూ తన నిర్ణయమే ఫైనల్. నాకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ని కూడా తనే డీల్ చేస్తున్నాడిప్పుడు.
అందుకోసమే...
నా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే విభిన్నమైన పాత్రలు చేయాలనేది నా లక్ష్యం. సినిమాల ద్వారా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాలనుకున్నా. భవిష్యత్తులో నా గతాన్ని, నా ఈ ప్రయాణాన్ని తిరిగి చూసుకుంటే... ఆనందం, తృప్తి ఉండాలి. అందుకోసమే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా.
పాత్ర ముఖ్యం...
‘కారా’ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శకుడు విఘ్నేశ్ రాజా విమర్శలను ఎదుర్కొన్నారు. నేను తమిళ అమ్మాయిని కాకపోవడమే అందుకు కారణం. కానీ నన్ను ఆ పాత్రకు ఎంపిక చేయడాన్ని నేను సమర్థిస్తున్నా. దర్శకుడికి తెలుసు ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలో. నన్ను నమ్మారు కాబట్టి ఆ పాత్రకు నేను న్యాయం చేయాలని భావిస్తా. మలయాళ నటిని అయినంత మాత్రాన వేరే భాషల్లో నటించడానికి అర్హత కోల్పోతానా?