విశ్వంభర వాయిదాల పర్వం.. అంచనాలు నిలబడతాయా?
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:13 PM
విశ్వంభర సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.. అసలు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది..? ఈ ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడు అని..?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వెండితెరపై కనిపిస్తే ఆ ఊపే వేరు. అందులోనూ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫాంటసీ కథతో ఆయన వస్తున్నారంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజమే. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) దర్శకత్వంలో మెగాస్టార్, త్రిష (Trisha Krishnan), అషికా రంగనాథ్ (Ashika Ranganath) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంభర (Vishwambhara). కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.. అసలు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది..? ఈ ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడు అని..?
నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. గతేడాది సంక్రాంతికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సి ఉంది. కానీ, విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్ , సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మెగాస్టార్ స్వయంగా గతంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా సినిమా వస్తుందని మాటిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా వేసవి సెలవుల్లో విశ్వంభర జాతర ఖాయమని ఫిక్స్ అయిపోయారు.
యూవీ క్రియేషన్స్ నిర్మాతలు రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు తీయిస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సమ్మర్ రేసు నుంచి విశ్వంభర తప్పుకున్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ, ఇప్పుడు అక్కడ కూడా బ్రేక్ పడేలా కనిపిస్తోంది.
గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. చిన్న తప్పు దొర్లినా సోషియో ఫాంటసీ సినిమాలపై ప్రభావం పడుతుంది. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇలాంటి చిత్రాలకు సరైన రిలీజ్ డేట్ చాలా ముఖ్యం. వేరే పెద్ద సినిమాలతో పోటీ ఉంటే వసూళ్లపై దెబ్బ పడే అవకాశం ఉంది. ఏ సినిమాకైనా సరైన సమయంలో ప్రమోషన్స్ మొదలుపెట్టి, అనుకున్న తేదీకి విడుదల చేస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది.
అయితే.. పదే పదే మూవీ వాయిదా పడటం వల్ల సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్టును సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ పైనే ఉంది. మరి ఈ సారైనా మేకర్స్ ఒక పక్కా క్లారిటీతో కూడిన అధికారిక ప్రకటన ఇస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా విశ్వంభర ఆలస్యమైనా సరే.. ఒక విజువల్ ట్రీట్‌లా వస్తుందని మాత్రం సినీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.