Mana Shankara Vara Prasad Garu: నాలుగు రోజులు... రూ. 200 కోట్లు...
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:15 PM
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంక్రాంతి సినిమాల ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Sankara Vara Prasad Garu) సినిమా నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసి, సింగిల్ లాంగ్వేజ్ పొంగల్ మూవీస్ లో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది. ఈ ఎదురు దాడిని ముందే గ్రహించిన చిత్ర నిర్మాతలు ఈ సినిమాపై ఉద్దేశ్యపూర్వకంగా ఎవరూ నెగెటివ్ ప్రచారం చేయకుండా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా... చిరంజీవి పేరు, 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా పేరు ఉదహరించకుండా సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేశారు. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో వారి పప్పులు ఉడకలేదు. సినిమా తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయినా కొన్ని సెంటర్స్ లో టాక్ కు కలెక్షన్స్ కూ సంబంధం లేదని, ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాలేదని కొందరు పెదవి విరిచారు.
చిరంజీవి, నయనతార (Nayanatara) జంట పైన కూడా నెగెటివ్ ట్రోలింగ్స్ నడిచాయి. గతంలో చిరంజీవి నయనతార 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి 'గాడ్ ఫాదర్'లోనూ నయనతార ఆయన సోదరి తరహా పాత్రను పోషించింది. ఆ మూవీ కూడా పరాజయం పాలైంది. దాంతో నయనతార చిరంజీవికి అచ్చిరాదనే ప్రచారమూ బాగా జరిగింది. అయితే వాటిని త్రోసిరాజని దర్శకుడు అనిల్ రావిపూడి చాలా హుందాగా నయనతార పాత్రను తీర్చిదిద్దాడు. బిజినెస్ మాగ్నెట్ కూతురు పాత్రలో నయనతార చక్కగా ఒదిగిపోయింది. ఇక సినిమా షూటింగ్ లో పాల్గొనక ముందే నయన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చూసి చాలామంది అవాక్కయ్యారు. ఇవన్నీ చాలామందికి మింగుడు పడలేదు. విక్టరీ వెంకటేశ్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడం, చిరు - వెంకీ మీద స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించడం, వీరిద్దరూ నటించిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ ను పెట్టి వారితో డాన్స్ చేయించడంతో ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) వింటేజ్ చిరంజీవిని అద్భుతంగా తెరపై చూపించాడని అందరూ అభినందించారు. దాంతో 'మన శంకర వర ప్రసాద్ గారు' అవలీలగా రూ. 200 కోట్ల గ్రాస్ ను వసులు చేసేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ జోరు ఏ తీరున సాగుతుందో చూడాలి.