Mana Shankara Vara Prasad Garu: వెంకీ నేను.. అల్లరి అల్లరి చేశాం.. చిరు ఎమోషనల్ స్పీచ్
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:36 AM
సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఈ పండక్కి మీ ఇంటి బిడ్డగా మీ ముందుకొస్తున్నాను. ఫ్యామిలీ అంతా కలసి థియేటర్లకు వచ్చి ఆశీర్వదించండని చిరంజీవి కోరారు.
‘సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఈ పండక్కి మీ ఇంటి బిడ్డగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) చిత్రంతో మీ ముందుకొస్తున్నాను. జనవరి 12న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. అలాగని ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఇందులో మంచి ఎమోషన్ ఉంది. ఫ్యామిలీ అంతా కలసి థియేటర్లకు వచ్చి సినిమా చూసి ఆశీర్వదించండి’ అని చిరంజీవి (chiranjeevi) అభిమానులను కోరారు.
ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఎందరో దర్శకులతో పనిచేశాను. అనిల్ రావిపూడి లాంటి ఎనర్జిటిక్ డైరెక్టర్స్ అరుదు. నాలోని కామెడీ టైమింగ్‌ను, వింటేజ్ చిరంజీవిని మళ్లీ బయటకు తీశాడు’ అని తెలిపారు.
‘నా సోదరుడు వెంకటేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఇందులో ప్రత్యేక పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం నా అదృష్టం. ఎన్నో ఏళ్ల క్రితం మేమిద్దరం కలసి ఓ మంచి చిత్రం చేయాలనుకున్నాం. ఇన్నేళ్లకు అనిల్ ద్వారా ఆ కోరిక తీరింది. కథ కుదిరితే మేమిద్దరం కలసి పూర్తిస్థాయి చిత్రం చేస్తాం. నా కూతురు సుస్మిత, సాహు గారపాటి ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు’ అని తెలిపారు. వెంకటేశ్ (venkatesh) మాట్లాడుతూ.. ‘నా తమ్ముళ్లు పవన్ కల్యాణ్, మహేశ్‌తో సినిమాలు చేశాను. ఇప్పడు అన్నయ్యతో చేస్తున్నాను. ఇద్దరం రఫ్ ఆడిస్తాం. ఆయనతో కలసి డాన్స్ చేయడం, కామెడీ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. మంచి ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.
అనిల్ రావిపూడి (anil ravipudi) మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. వెంకీ గారు ఈ సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. వారి కాంబినేషన్ మిమ్మల్ని అలరిస్తుంది’ అని అన్నారు. సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘సంక్రాంతికి ఒక సినిమాను విడుదల చేయడమే గొప్ప విషయం. అలాంటిది డాడీ సినిమాతో మీ ముందుక రావడం మర్చిపోలేని అనుభవం’ అని చెప్పారు ఇద్దరు స్టార్స్‌తో సినిమా చేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది, సంక్రాంతికి బాక్సాఫీసును షేక్ చేస్తాం అని సాహు గారపాటి చెప్పారు.