విశ్వంభరనా.. కాకానా? మెగాస్టార్ సంక్రాంతి మూవీపై ఉత్కంఠ!

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:43 PM

మెగావర్స్‌తో ఓటీటీలో సందడి చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. మరి సంక్రాంతికి థియేటర్లలోకి రాబోయే సినిమా ఏది? విశ్వంభరనా.. కాకానా? మెగా అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్న ప్రశ్న ఇదే!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు వింటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇక ఆయన వేసే ప్రతి అడుగు, తీసుకొచ్చే ప్రతి ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒకటే చర్చ.. అదే మెగావర్స్. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి హోస్ట్‌గా ఒక భారీ టాక్ షో రాబోతోంది. ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్‌తో మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారనే టాక్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

ఈ సరికొత్త అవతారంలో చిరంజీవిని చూడటానికి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఓటీటీ హడావిడి ఎంత ఉన్నప్పటికీ, మెగా అభిమానుల మదిలో మాత్రం వేరే ఒక పెద్ద సస్పెన్స్ గట్టిగా రన్ అవుతోంది. వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రాబోయే తమ అభిమాన హీరో అసలైన చిత్రం ఏది? సంక్రాంతి బరిలో దిగే ఆ ఒక్క మూవీ ఏది? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం చిరంజీవి లైనప్‌లో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి సోషియో ఫాంటసీ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara). దీనిపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, విభిన్న కథాంశంతో బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా (Kaka) చిత్రం కూడా శరవేగంగా ముస్తాబవుతోంది. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్‌లో అతిపెద్ద రిలీజ్ సీజన్. అందులోనూ మెగాస్టార్ సినిమా బరిలో ఉంటే ఆ కిక్కే వేరు. కానీ ఈసారి రేసులో ఉన్నది రెండు చిత్రాలు. వీటిలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి మొదట అడుగుపెట్టేది ఏది..? అనేది ఇంకా తేలలేదు. నేటి ట్రెండ్‌లో సినిమా బిజినెస్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తే, అది నిర్మాతలకి పెద్ద రిస్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది. భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో ఉండాలన్నా.. ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్ లేకుండా సరైన బజ్ క్రియేట్ అవ్వాలన్నా స్పష్టమైన ప్రణాళిక ఎంతో అవసరం. ఒక సినిమా మీద ప్రేక్షకుల దృష్టి పూర్తిగా కేంద్రీకృతమైతేనే ప్రమోషన్లను పీక్స్ స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. టీజర్లు, పాటలు, ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు.. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు సరైన స్పేస్ దక్కాలి. ఏ సినిమా ముందు వస్తుందో తెలిస్తేనే రెండు చిత్రాల నిర్మాణ సంస్థలు తమ పబ్లిసిటీ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయగలవు.

అందుకే ఇప్పుడు అందరి చూపూ మెగాస్టార్ చిరంజీవి మీదే ఉంది. పరిస్థితిని బేరీజు వేసుకుని, మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. విశ్వంభర ఫాంటసీ ప్రపంచంతో సంక్రాంతి (Sankranthi) కి దిగుతారా..? లేక కాకా మాస్ ఎంటర్‌టైనర్‌ను ఫెస్టివల్ రేసులో నిలబెడతారా..? అనేది తేలాల్సి ఉంది. అయితే.. సోష‌ల్ మీడియాలో, సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ సంక్రాంతికి విశ్వంభ‌రనే థియేర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం టాక్ షోతో ఓటీటీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్, వెండితెరపై ఎలాంటి బాంబ్ పేలుస్తారో చూడాలి.

Updated Date - Nov 01 , 2026 | 02:44 PM