రామ్ చరణ్ కి సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:41 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే.

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. పెద్ది (Peddi) సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయమైనప్పటికీ, సినిమా ప్రమోషన్స్, ఇతర పనులకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన నొప్పిని భరిస్తూనే ప్రమోషన్స్ పూర్తి చేసిన విషయం తెల్సిందే. సర్జరీ కూడా పెద్ది రిలీజ్ అయ్యాకే చేయించుకుంటానని చెప్పాడు. ఆ బాధ్యతలన్నీ ముగియడంతోపాటు తదుపరి సినిమాకి కూడా ఈ సర్జరీ అడ్డుగా ఉండడంతో ఇప్పుడు చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.


రామ్ చరణ్ మణికట్టు శస్త్రచికిత్స కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లాడు. సోమవారం అక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన గంగా ఆసుపత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ జరగనుంది. చరణ్ హాస్పిటల్‌లో చేరనున్న నేపథ్యంలో ఆయనకు తోడుగా మెగా కుటుంబం మొత్తం కోయంబత్తూరుకు ప్రయాణమైంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, సతిమణి ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు ఈ పర్యటనలో చరణ్ వెంట ఉండనున్నారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించనుంది.ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


పెద్ది సినిమా తరువాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులతో సుక్కు బిజీగా ఉన్నాడు. ఈ సర్జరీ వలన సుక్కు సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. సర్జరీ తరువాత చరణ్ కొన్నిరోజులు రెస్ట్ తీసుకోనున్నాడు. ఆ తరువాత సుక్కు - చరణ్ కినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి గ్రామీణ నేపధ్యంలో కాకుండా కమర్షియల్ కథతో సుక్కు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యడాని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో చరణ్- సుక్కు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Jul 26 , 2026 | 07:44 PM