Chiranjeevi: ఏఐ మోసాలకు చెక్ పెట్టాలి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి
ABN , Publish Date - Nov 16 , 2026 | 04:35 PM
కృత్రిమ మేధ (AI) సాయంతో జరుగుతున్న మోసాలు, డీప్‌ఫేక్ వీడియోల సృష్టి, వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేయడం వంటి పరిణామాలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ (AI) సాయంతో జరుగుతున్న మోసాలు, డీప్‌ఫేక్ వీడియోల సృష్టి, వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేయడం వంటి పరిణామాలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన చట్టపరమైన, సాంకేతిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సందర్భంగా ఏఐ దుర్వినియోగం గురించి చర్చించిన చిరంజీవి.. ఆయన సూచనల మేరకు తాజాగా కిషన్‌రెడ్డిని కలిసి తన అభ్యర్థనలను వివరించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల ముఖాలు, గొంతులను అనుమతి లేకుండా మార్చడం, తప్పుడు వీడియోలను రూపొందించడం వంటి చర్యలు తీవ్ర సమస్యగా మారుతున్నాయని పేర్కొన్నారు. వీటిని నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు, సమర్థవంతమైన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కిషన్‌రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కళాకారుల వ్యక్తిగత గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటం ఎంత ముఖ్యమో.. డిజిటల్ ప్రపంచంలో సామాన్య పౌరుల భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ నెల 2న చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ భేటీలో డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల ఎదురవుతున్న ముప్పులపై చర్చించారు. తమ ఆందోళనలను హోంమంత్రి అర్థం చేసుకున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి మరిన్ని నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు కఠిన శిక్షల దిశగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.