చిరంజీవి: ఉగాది శుభాకాంక్షలతో పాటు కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:04 PM

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు, ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు, ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. పరాభవ నామ సంవత్సరంలో అందరికీ శుభాలే జరగాలని, అధర్మం, అహంకారాలకు.. ధర్మం చేతిలో పరాభవం జరిగి... శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని, ఆ ‘పరా’(శక్తి), ‘భవు’డు(శివుడు) సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం జరగాలంటూ చిరు శుబాకాంక్షలు తెలిపారు.

అలాగే ఈ ఉగాది పండగ వేళ చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు కేరాఫ్‌ అయిన ఆయన దాదాపు 25 ఏళ్లకు పైగా బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానితో ఆ సేవా కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పడకూడదని మరో రూపంలో కూడా సేవలు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా మరో సరికొత్త సేవా కార్యక్రమానికి చిరు శ్రీకారం చుట్టారు.

భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కుటుంబంలోని ఒక వ్యక్తి చదువుకుంటే.. ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఆ దిశగానే ఆలోచిస్తున్నా. నా స్ఫూర్తితోనే ‘అగరం ఫౌండేషన్‌  స్థాపించి, పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తున్నానని తమిళ నటుడు సూర్య ఎన్నో సందర్భాల్లో చెబుతుంటాడు. విద్యాదానం విషయంలో అతని ఆలోచన నన్ను ఎంతగానే ప్రభావితం చేసింది. ఒకప్పుడు నేను నీకు ఇన్‌స్పిరేషన్‌.. ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్‌పిరేషన్‌’ అని సూర్యతో అన్నాను. తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాకుండా ఆ అవసరం ఉన్న అందరికీ ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నా’ అని చిరంజీవి అన్నారు.  

Updated Date - Mar 19 , 2026 | 08:24 PM