పవన్‌కల్యాణ్: అన్నయ్య ఆలోచనకు పవన్ ఫిదా
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:03 PM
తాను చేస్తున్న సేవా కార్యక్రమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాను చేస్తున్న సేవా కార్యక్రమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ అవసరమైన పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యని అందించడంపై దృష్టి పెట్టనున్నట్టు ఉగాది సందర్భంగా ఆయన వెల్లడించారు. సేవా కార్యక్రమాలను మరింత పెంచనున్నామని అన్నారు.
ఈ విషయంపై ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (pawan Kalyan) స్పందించారు. ‘అన్నయ్య చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంగా పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఆయన విశాల హృదయాన్ని చాటింది. విద్యా దానం ద్వారా జ్ఞాన వ్యాప్తి సాధ్యమవుతుంది. పేదల ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలనుకొంటున్న అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవా గుణంతో మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఉగాది సందర్భంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ ‘బ్లడ్ బ్యాంక్ అనేది 25 ఏళ్ల కిందట వచ్చిన ఆలోచన. అది అక్కడితో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ సేవకు మరిన్ని సేవా కార్యక్రమాల్ని జోడించి విస్తృతం చేసే దిశగా ఆలోచిస్తున్నా. ఒక వ్యక్తి విద్యావంతుడైతే కుటుంబం మొత్తం బాగుంటుంది. నటుడు సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో ‘అగరం ఫౌండేషన్’ ప్రారంభించి ఎంతోమందికి విద్యను అందిస్తున్నాడు. ఇంకా ఎన్నో సేవలు చేస్తున్నారు. విద్యారంగంలో సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకెంతో ప్రేరణనిచ్చాయి. ఇప్పుడు తన స్ఫూర్తిగా తీసుకుని ఉచిత విద్యని పేద విద్యార్థులకు అందించాలనుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎవరికి అవసరం ఉన్నా ఈ సేవలు అందుతాయి. అయితే ఎలా అందించాలన్న విషయంలో సూర్య దగ్గర ఐడియా తీసుకుని ప్రణాళిక తయారు చేసి ఆ దిశగా ఉచిత విద్యని అందించేందుకు కృషి చేస్తాను’ అన్నారు చిరంజీవి.