మైత్రీ, దిల్ రాజులకు ఝలక్! 'కాకా' నైజాం రైట్స్ ఎగురేసుకుపోయిన మరో డిస్ట్రిబ్యూటర్
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:59 PM
మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా బిజినెస్‌లో దూసుకెళ్తోందా? నైజాం హక్కులను ఏషియన్ సినిమాస్ రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కాకా (Kaka Movie). 'వాల్తేరు వీరయ్య' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్లో ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. తండ్రీకూతుళ్ల బలమైన భావోద్వేగాలతో పాటు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూతురి రోల్లో అనస్వర రాజన్ (Anaswara Rajan) నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, అలాగే నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా (Sankranti 2027) జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బిజినెస్ పరంగా వేగం పెంచారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. తాజాగా 'కాకా' నైజాం హక్కులను (Nizam Rights) ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'ఏషియన్ సినిమాస్' దాదాపు రూ.35 కోట్లకు రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతిలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సైతం గట్టిగా పోటీ పడినప్పటికీ.. చివరికి ఏషియన్ సినిమాస్‌తో ఈ భారీ డీల్ లాక్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేవలం నైజామే కాకుండా.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక హక్కులకు సంబంధించి కూడా భారీ రేట్లు పలుకుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 130 కోట్ల మార్కెట్ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఏమాత్రం భారీ పోటీ ఉందనే చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 12 విడుదల.. 'కాకా' కన్నా సరిగ్గా ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'సంబరాల ఏటిగట్టు'తో పాటు శ్రీవిష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' కూడా పోటీపడుతున్నాయి. అలాగే శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్' జనవరి 14న విడుదల కానుంది. ఇలా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ రికార్డుల జోరు ముందు ఇవన్నీ ఎలా నిలవబోతున్నాయి? ఈ సంక్రాంతికి మెగా మాస్ రచ్చ ఏ స్థాయిలో ఉండబోతోంది? తెలియాలంటే జనవరి 13 వరకు ఆగాల్సిందే.