Fan Post Viral: ఉలితో తనను తాను చెక్కుకున్న అద్భుతమైన కృష్ణ శిల.. చిరంజీవి
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:34 PM
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులే కాకుండా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుచుకునే అభిమానులు తమ విషెస్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (HBD Chiranjeevi) సందర్భంగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులే కాకుండా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుచుకునే అభిమానులు తమ విషెస్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అభిమానానికి అక్షర రూపం ఇచ్చిన ఈ విషెస్ ను మీరు చదవండి.. (Fan Post Viral)
నటన అనే అసురత్వం తనలో నింపుకున్న నాటి నుండి అందరివాడి వరకు ...... చిరంజీవి అనే ఒక శకం.... తెలుగు సినీ జగత్తును తన నటన తో, అభినయం తో ఓలలాడిస్తుంది. కొంతమంది నటులు సినిమాల్లో కనిపిస్తారు... కొంతమంది నటులు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు... కానీ కొందరు మాత్రం సినిమా చరిత్రలో ఒక శకంగా మారిపోతారు. ఆ శకానికి పేరు "చిరంజీవి" ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అంటే ఒక నటుడికి శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు. తెలుగు సినిమా రంగాన్ని తన శ్రమతో, తన ప్రతిభతో, తన వ్యక్తిత్వంతో దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఒక మహానటుడి ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడం.
నటనాసురుడు నటనలో, కష్టించి పని చేయడంలో "రాక్షసుడు". తెరపై పాత్ర ఏదైనా కావచ్చు. కోపం కావచ్చు... ప్రేమ కావచ్చు... హాస్యం కావచ్చు... బాధ కావచ్చు... ఆవేశం కావచ్చు... ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకునే ఒక ప్రత్యేకమైన శక్తి ఆయన నటనలో ఉంటుంది. అందుకే ఆయన పక్కన ఎంతటి అందమైన కథానాయిక నిలిచినా, ఎంతటి భారీ దృశ్యం ఉన్నా, ప్రేక్షకుడి చూపు చివరకు చిరంజీవిపైనే నిలిచిపోతుంది. అది కేవలం నటన కాదు... తెరను తన ఉనికితో నింపగలిగిన అజేయమైన శక్తి. కృషి, పట్టుదల అనే ఉలి తో తనను తాను చెక్కుకున్న అద్భుతమైన కృష్ణ శిల..... "చిరంజీవి".
"ఖైదీ"గా అభిమానుల గుండెల్లోకి ప్రవేశించిన ఆయన, అక్కడి నుంచి బయటకు రావడానికి ఆయన ప్రయత్నించనులేదు. అభిమానులు కూడా ఆయనను తమ గుండెల్లో ఖైదీగానే బంధించారు. ఆ బంధం ఆ ఒక్క సినిమా విజయం తో ఏర్పడింది కాదు...రకరకాల పాత్రలతో పక్కింటి కుర్రాడిగా, ఒక చిలిపి భర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ధీశాలి గా, ఇలా అనేక పాత్రలతో సంవత్సరాల తరబడి ఆయనపై ప్రేక్షకులు మక్కువ పెంచుకుంటే..... ఆ మక్కువపై నిర్మాతలు పెట్టుబడి పెట్టడం తో ఆయన మార్కెట్ విస్తృతి బాగా పెరిగి ఇండియా లో, 1992లో చిరంజీవి అందుకున్న రికార్డు స్థాయి రెమ్యునరేషన్ (₹1.25 కోట్లు) ఆధారంగా, జాతీయ పత్రికలు ఆయనను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పోల్చాయి. "Bigger than Bachchan" (బచ్చన్ కన్నా పెద్దవారు) అనే ప్రసిద్ధ శీర్షికను ప్రముఖ వారపత్రిక ది వీక్ (The Week) తన కవర్ స్టోరీలో ప్రచురించింది.
"జగదేకవీరుడు"గా అద్భుతమైన ఊహాలోకంలో విహరించినా, నేల మీద మాత్రం సామాన్యుడిగానే కనిపించడం చిరంజీవి వ్యక్తిత్వం.... అదే ఆయన ప్రత్యేకత. "మగధీరుడు"గా తెరపై వీరత్వాన్ని చూపించినా, కుటుంబానికి మాత్రం ప్రేమను, బాధ్యతను, పెద్దరికాన్ని ప్రతీకగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందుకే ఒక కుటుంబానికి పెద్దగా ఎలా ఉండాలి అని అన్నప్పుడు కూడా చిరంజీవి వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చెప్పగలిగే స్థాయి లో ఆయన ఉన్నారు.
'మృగరాజు"గా కనిపించినప్పుడు ఆయనలోని వేటగాడిని ప్రేక్షకులు గా చూశారు. "ఠాగూర్" చిత్రం లో అవినీతి ప్రశ్నించే తత్వం ఆయనలో ఉండే నైజం. కాని నిజ జీవితంలో ఎవరికి అన్యాయం చేసినా కాలం మాత్రం ఎప్పటికి క్షమించదు అనే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఎవ్వరిని ఎక్కడా మాటలతో నొప్పించరు. "అంజి"చిత్రం లో కనిపించిన సాహసం ఒక కోణం అయితే, నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే ఆలోచన ఆయనలోని మానవత్వానికి మరో కోణం. అందుకే ఆయనను అభిమానులు కేవలం మెగాస్టార్‌గా మాత్రమే చూడలేదు. "ఆపద్భాందవుడి"గానూ చూశారు... చూస్తున్నారు.
రక్తదానానికి ఒక ఉద్యమ రూపం ఇవ్వడం, రక్తనిధి ద్వారా అవసరమైన వారికి సహాయం అందించడం, నేత్రదానంపై అవగాహన కల్పించడం.... ఇవన్నీ ఒక నటుడి ప్రజాదరణను సమాజానికి ఉపయోగపడే మార్గంగా మలచిన ఉదాహరణలు. తెరపై ఆయనకు మాస్ ఇమేజ్ వచ్చింది. బయట ఆయనకు మనిషిగా ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చింది. ఇదే చిరంజీవి ప్రయాణంలోని అసలు విశేషం. "చంటబ్బాయ్" గా నవ్వించినా... "ఖైదీ"గా రగిలించినా... "జగదేకవీరుడు"గా మంత్రముగ్ధులను చేసినా... "మగధీరుడు"గా వీరత్వాన్ని చూపించినా... ప్రేక్షకుడు చివరికి గుర్తుపెట్టుకున్నది మాత్రం ఒకటే ....చిరంజీవి
అందరివాడు. అది ఆయనకు అభిమానులు ఇచ్చిన అత్యంత గొప్ప బిరుదు.
ఎందుకంటే చిరంజీవిని ప్రేమించడానికి ప్రతి ఒక్కరికి , ప్రతి తరానికి నచ్చే ఒక కోణం ఉంది. ఒక తరం ఆయనను హీరోగా చూసింది. మరో తరం ఆయనను కుటుంబ సభ్యుడిలా చూసింది. ఇంకో తరం ఆయన సినిమాలను చూసి పెరిగింది. అందుకే చిరంజీవి ఒక నటుడు మాత్రమే కాదు.
ఒక తరం జ్ఞాపకం. ఒక కుటుంబ అనుబంధం. ఒక అభిమాన సామ్రాజ్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అయితే ఈ స్థాయికి తీసుకు వచ్చింది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. అహర్నిసం శ్రమించే నిత్య కృషీవలుడు కావడమే ఆయనలో అసలు బలం. విజయం వచ్చినప్పుడు ఆగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగడం.. అదే తనను తానే తీర్చిదిద్దుకున్న వైనం దగ్గర నుండి చూసినవారికి తెలుసు.
అందుకే చిరంజీవి కథను కేవలం సినిమాల జాబితాగా చదవలేం. అది కలలు కనడం నుంచి వాటిని సాకారం చేసుకోవడం వరకు సాగిన ఒక ప్రయాణం. సినిమాలోకి వచ్చిన ప్రతి యువకుడికి ఆయన ఒక స్ఫూర్తి. అభిమానిగా మారిన ప్రతి ఒక్కరికీ ఆయన ఒక జ్ఞాపకం. తెలుగు సినిమా గురించి మాట్లాడే ప్రతి తరానికి ఆయన ఒక అధ్యాయం.
అందుకే.. నటనాసురుడిగా తెలుగు తెరను శాసించాడు... చంటబ్బాయ్‌గా ప్రతి ఇంటి మనిషిలా నవ్వించి... చివరికి మాత్రం... అందరివాడిగా నిలిచాడు. అందుకే చిరంజీవి పుట్టినరోజు ఒక నటుడి పుట్టినరోజు మాత్రమే కాదు. తెలుగు సినిమా ఒక శకాన్ని గుర్తుచేసుకునే రోజు.
ఆ శకానికి తెలుగు తెర పేరు మెగాస్టార్ చిరంజీవి. జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్...
మీ ప్రయాణం కొనసాగాలి.
మీ పేరు తరాలు దాటాలి.
మీ అభిమానుల గుండెల్లో ఆ చిరంజీవిత్వం ఎప్పటికీ నిలిచి ఉండాలి అని కోరుకుంటూ... మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ఆ అభిమాని పోస్ట్ లో పేర్కొన్నారు.
అభిమాని పోస్ట్..