MEGA 158 లేటెస్ట్ అప్‌డేట్.. చిరు పాత్రలపై ట్విస్ట్!

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:20 PM

చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న MEGA 158 సినిమాపై ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది.

chiranjeevi

ఈ ఏడాది ప్రారంభంలో 'మన శంకరవరప్రసాద్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి సంచలనం సృష్టించింది. అదే జోష్‌తో చిరంజీవి ఇప్పుడు తన 158వ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ (Bobby Kolli)తో కలసి చేస్తున్న సినిమా కావడంతో MEGA 158పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. KVN ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అటు చిరుకి డ్యూయల్ రోల్స్ చేయడం కొత్తేం కాదు. నాటి ‘నకిలీ మనిషి’ నుంచి ‘ఖైదీనంబర్‌ 150’ వరకూ చాలా సినిమాల్లో డ్యూయెల్‌ రోల్స్‌తో అదరగొట్టారు. అయితే సినీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. ఈ తరహా పాత్రలు చేసేందుకు చిరు ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదని సమాచారం.

గతంలో ఆయన 'సింహపురి సింహం' చిత్రంలో తొలిసారి తండ్రీకొడుకులుగా నటించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత 1995లో 'రిక్షావోడు', 1999లో 'స్నేహం కోసం', 2005లో 'అందరివాడు' సినిమాల్లో ఆయన తండ్రీకొడుకులుగా అలరించారు. వీటిలో 'రిక్షావోడు' అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, 'స్నేహం కోసం' చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, స్నేహం నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక 'అందరివాడు' చిత్రం సగటు టాక్‌కే పరిమితమైనప్పటికీ చిరంజీవి కామెడీ టైమింగ్, నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గత అనుభవాల దృష్ట్యా చిరు మళ్లీ తండ్రీకొడుకుల పాత్రలు చేసేందుకు సుముఖంగా లేరని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక 'MEGA 158' విషయానికి వస్తే, ఇందులో అనశ్వర రాజన్ చిరు కూతురి పాత్రలో నటిస్తుండగా, నివేదా థామస్ మరొక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి 'వాల్తేరు వీరయ్య'తో అలరించిన చిరు-బాబీ కాంబినేషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Updated Date - Aug 04 , 2026 | 02:53 PM