‘మెగావర్స్’.. చిరంజీవి కొత్త అవతారం

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:26 PM

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Chiranjeevi, Megaverse

తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెండితెరపై ఆయన వేసే ప్రతి అడుగు ఒక సంచలనం. నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌డమ్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను శాసిస్తున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్త రికార్డులకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే బిగ్ స్క్రీన్‌పై రెండు భారీ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్న వేళ, సినీ వర్గాలను ఆశ్చర్యపరిచేలా ఒక ఊహించని న్యూస్ బయటకు వచ్చింది.

వెండితెరతో సమానంగా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదికలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే వేదికపై మెగాస్టార్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయ దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఒక భారీ టాక్ షో చేయబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ షోకు ‘మెగావర్స్’ (Megaverse) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కోణంలో చిరంజీవి ఈ షోను హోస్ట్ చేయబోతున్నారట. ఈ టాక్ షో ప్లానింగ్ సైతం ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉండబోతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా 15 ఎపిసోడ్ల భారీ షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దేశవ్యాప్త సెలబ్రిటీలు ఈ షోలో ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారని తెలుస్తోంది. వారి అంతరంగ విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలను చిరంజీవి తనదైన శైలిలో రాబట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక షో షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ కూడా సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్‌లోనే ఇది అతిపెద్ద గేమ్ ఛేంజర్ కానుంది. అయితే తొలి షో బ్ర‌హ్మానందం, స‌త్య‌, సునీల్ అతిథులుగా పాల్గొన్న‌ట్లు ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

ఇక ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ విశ్వంభర రిలీజ్ గురించి కూడా ఫిల్మ్ నగర్‌లో సరికొత్త రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. గ్రాఫిక్స్ వర్క్‌లో ఏమాత్రం రాజీ పడకుండా ప్రపంచ స్థాయి అవుట్‌పుట్ తీసుకురావడానికే చిత్ర బృందం సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీపై వచ్చిన రూమర్లకు దర్శకుడు వశిష్ట, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాయి. ఒకవైపు బిగ్ స్క్రీన్‌పై థియేటర్లలో రికార్డుల వేట.. మరోవైపు ఓటీటీలో సరికొత్తగా మెగావర్స్ హంగామా, ఇలా రెండు వేదికలపైనా ఒకేసారి మెగాస్టార్ ప్రభంజనం సృష్టించబోతున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 06:42 PM