Tollywood: గ్యాంగ్ స్టర్స్‌గా.. చిరు, బాలయ్య! మరోసారి.. సంక్రాంతి బరిలోకి?
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:18 PM
టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఒకే తరహా మూవీస్ లో నటించబోతున్నారట. ఆ రెండు సినిమాలు కూడా ఒకే సీజన్ లో జనాన్ని పలకరిస్తాయనీ వినిపిస్తోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక సంవత్సరాలు ఢీ అంటే ఢీ అంటూ సాగిన స్టార్ హీరోస్ ఎవరంటే - మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నటసింహ బాలకృష్ణ (Balakrishna) అనే చెప్పాలి. వీరిద్దరి సినిమాలు పోటీ పడితే చూడాలని సినీ ఫ్యాన్స్ కూడా ఆశిస్తూ ఉంటారు. ఒకసారి చిరుది పైచేయిగా సాగితే, మరోమారు బాలయ్యది అప్పర్ హ్యాండ్ గా ఉన్న సందర్భాలున్నాయి. అందువల్లే పోటీ అంటే వీరిద్దరి మధ్యే అన్నది తెలుగు సినీ ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇద్దరూ ఒకే తరహా కథల్లో నటిస్తున్నారని టాక్. పైగా ఆ రెండు చిత్రాలు వచ్చే 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతాయనీ వినిపిస్తోంది.
చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతోందట. ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. ఇక మరోవైపు బాలకృష్ణ కథానాయకునిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే మూవీ కూడా గ్యాంగ్ స్టర్ కథతోనే సాగనుందట. అందువల్ల సినీ ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొంది. పైగా 2023లో కూడా ఓ వైపు బాలకృష్ణ- గోపీచంద్ మలినేని తమ 'వీరసింహారెడ్డి' (Veerasimha Reddy) తో బరిలోకి దూకారు. ఆ సినిమా వచ్చిన మరుసటి రోజునే చిరంజీవి- బాబీ కాంబోలో 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) వెలుగు చూసింది. రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ఈ చిత్రాలు విజయాన్ని చవిచూశాయి. రెండు సినిమాలనూ అభిమానులు పోటాపోటీగా గోల్డెన్ జూబ్లీ ఆడించడం విశేషం. అందువల్ల చిరు-బాలయ్య బాక్సాఫీస్ వార్ మళ్ళీ సంక్రాంతిలోనే సాగితే రంజుగా ఉంటుందని సినీజనం భావిస్తున్నారు.
గతంలోనూ చిరంజీవి, బాలకృష్ణ కొన్ని చిత్రాల్లో గ్యాంగ్ స్టర్స్ గా నటించి అలరించారు. అయితే అప్పట్లో చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా 'లంకేశ్వరుడు', 'గూండా' వంటి చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాల్లో 'గూండా' అలరించింది. ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయన 'యువరత్న రాణా', 'అశోక చక్రవర్తి' మూవీస్ లో గ్యాంగ్ స్టర్ గా కనిపించారు.. 'యువరత్న రాణా' ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ గ్యాంగ్ స్టర్స్ గా నటించే కొత్త సినిమాలపై సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. నవతరం ప్రేక్షకులను ఈ సీనియర్ స్టార్స్ గ్యాంగ్ స్టర్స్ గా ఏ రీతిన మెప్పిస్తారో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతోంది. మరి చిరంజీవిని బాబీ, బాలయ్యను గోపీచంద్ ఏ తీరున తెరపై చూపిస్తారో చూడాలి.