ఒకే చిత్రంలో చిరంజీవి, బాలకృష్ణ!
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:19 PM
పలు మల్టీస్టారర్స్ జనం ముందు నిలుస్తున్నాయి. అయితే తెలుగునాట కొన్ని దశాబ్దాల నుంచీ అసలు సిసలు మల్టీస్టారర్ రాలేదని టాక్. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయిందని వినిపిస్తోంది. ఏమిటో అది!?
తెలుగునేలపై యన్టీఆర్ (NTR), ఏయన్నార్ (ANR) తరువాత అంతగా బాక్సాఫీస్ వార్‌లో పాలుపంచుకున్న హీరోలు ఎవరంటే బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi) అనే చెప్పాలి. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ స్టార్స్ ఇద్దరి మధ్య పోటీ సాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే యన్టీఆర్ - ఏయన్నార్ కన్నా మిన్నగా ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలో ఇంకా పోటాపోటీగా సాగుతున్నారు. అప్పుడప్పుడూ వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నా- అవి వారి స్నేహం ముందు టీకప్పులో తుఫానులాంటవే. అలాంటి ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ కలసి నటిస్తే చూడాలన్నది తెలుగు సినీ ఫ్యాన్స్ అభిలాష. 1987లో వెంకటేశ్ హీరోగా రూపొందిన 'త్రిమూర్తులు' చిత్రంలో ఓ పాటలో బాలకృష్ణ, చిరంజీవి కలసి తెరపై కనిపించారు. ఆ తరువాత వారి సినిమాల ఫంక్షన్స్‌లో మినహాయిస్తే చిరు, బాలయ్య కలసి కనిపించింది తక్కువే. నలభై ఏళ్ళకు పైబడి ఈ ఇద్దరు హీరోలు పోటీపడుతున్నా, ఏ నాడూ కలసి నటించక పోవడం గమనార్హం! బహుశా, తమ ఫ్యాన్స్ మధ్య గొడవలు తలెత్తుతాయని కాబోలు బాలయ్య, చిరంజీవి ఇప్పటి దాకా ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
తమిళనాట కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajanikanth) కూడా 1985లో 'గిరఫ్తార్' తరువాత మళ్ళీ కలసి నటించలేదు. వారిద్దరి అభిమానులు థియేటర్స్‌లో గొడవపడతారనే ఉద్దేశంతోనే కమల్, రజనీ ఆ డెసిషన్ తీసుకున్నామని చెప్పేవారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కమల్, రజనీకాంత్ ఒకే సినిమాలో నటించబోతున్నారు. సదరు చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఆ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ విషయం వెలుగు చూసిన దగ్గర నుంచీ తెలుగునాట కూడా చిరంజీవి, బాలకృష్ణ ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందన్న ఊహాగానాలు అధికమయ్యాయి.
బాలకృష్ణ, చిరంజీవి కలసి నటించడం కల్ల అంటున్నారు చాలామంది సినీ ఫ్యాన్స్. అయితే ఆ మధ్య జరిగిన బాలకృష్ణ నటజీవిత స్వర్ణోత్సవంలో చిరంజీవి స్వయంగా తాము కలసి నటిస్తామని, సరైన సబ్జెక్ట్‌ను తయారు చేయమని బోయపాటి శ్రీనును ఉద్దేశించి చెప్పారు కూడా. అప్పట్లో అది కేవలం 'గాలి మాటే' అనుకున్నారు. కానీ, ఇప్పుడు కమల్, రజనీ కలసి నటించబోతూండగా, తెలుగులో అంతటి ఈక్వల్ స్టార్ డమ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ ను హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తక మానదు. బాలయ్య గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి చెప్పినట్టు బోయపాటి శ్రీను వీరిద్దరి కోసం కథ తయారు చేస్తారేమో చూడాలి. బాలయ్య, చిరు ఇద్దరికీ ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారి స్థాయికి తగ్గ సబ్జెక్ట్ ను ఎవరు సిద్ధం చేస్తారో? ఆ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మిస్తారో? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా బాలయ్య, చిరు కాంబోలో సినిమా వస్తే మాత్రం అది సినీ ఫ్యాన్స్ కు కన్నుల పండగ అనే చెప్పాలి.