Chinmayi: క్యాస్టింగ్‌ కౌచ్‌.. చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి రియాక్షన్

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:26 AM

‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు.

‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) స్పందించారు. చిరంజీవి ఏమన్నారంటే.. ‘సినీ ఇండస్ట్రీ అద్దంలాంటిది. మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితమే వస్తుంది. ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ప్రోత్సహించాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ. ‘ఇక్కడ నెగెటివ్‌ పీపుల్‌ ఉంటారు. చేదు అనుభవాలు ఎదురవుతాయి’ అనుకుంటే అది నీ తప్పిదం. నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరు. క్యాస్టింగ్‌ కౌచ్‌లాంటివి ఉండవు. నువ్వు ప్రొఫెషనల్‌గా ఉండాలి. కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది’ అని అన్నారు.

దీనికి చిన్మయి స్పందిస్తూ.. పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని చెబుతూ ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ పెద్ద సమస్యగా ఉంది. కమిట్‌మెంట్‌ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావు. మామూలుగా కమిట్‌మెంట్‌ అంటే వృత్తిపరమైన నిబద్థత అనే అర్థం. కానీ, ఇండస్ట్రీలో మాత్రం దాని అర్థం వేరు. కొందరు మగాళ్లు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏదో ఆశిస్తారు. గతంలో ఓ ప్రముఖ సింగర్‌ ఇండస్ట్రీ లో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలి వెళ్లిపోయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతోమంది ఇక్కడ వేదికలపై మాట్లాడుతూనే ఉన్నారు. నేనుకూడా గతంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. నా తల్లి సమక్షంలోనే ఎంతో నమ్మిన ఒక పెద్దాయన నాతో తప్పుగా ప్రవర్తించాడు. చిరంజీవి ఓ లెజెండ్‌. ఆయన తరంలో నటీనటులంతా ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండేవారు. పరస్పరం గౌరవించుకునే వారు. లెజెండ్‌లతో కలిసి వర్క్‌ చేసిన వారు కూడా నా దృష్టిలో గొప్పవారే’ అని చిన్మయి ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలానే సీనియర్ నటి 'షావుకారు' జానకి గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని చిన్మయి తప్పుపట్టింది. 'షావుకారు' జానకి తనకు తాను ఫెమినిస్టునని ఓ ఇంటర్వ్యూ చెప్పుకున్నారని, వై.జి. మహేంద్రతో జరిగిన ఆ ముఖాముఖిలో ఆమె, మహేంద్ర ఇద్దరూ మీటూ అంశంలో పోరాటం చేస్తున్న మహిళలను కించపరిచేలా మాట్లాడారని చిన్మయి ఆరోపించారు. సినిమా రంగంలోని మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా తెలియచేస్తే ఆమె కుటుంబానికి, భర్తకు అవమానకరం అన్నట్టుగా 'షావుకారు' జానకి మాట్లాడారని చిన్మయి వాపోయింది.

Updated Date - Jan 27 , 2026 | 11:51 AM