Chinmayi: కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు.. చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి సంచలన ట్వీట్! ఫ్యాన్స్ ఫైర్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:07 AM

ఇటీవలే జరిగిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ‘ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు. కొత్త వారికి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi

ఇటీవలే జరిగిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం సక్సెస్‌ మీట్‌లో ‘ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు. కొత్త వారికి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది’ అని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై గాయని చిన్మయి (Chinmayi Sripada) స్పందించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

‘పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య ఎక్కువగా ఉంది. కమిట్‌మెంట్‌ ఇవ్వకుంటే మహిళలకు అవకాశాలు ఇవ్వని పరిస్థితి. పరిశ్రమలో కమిట్‌మెంట్‌ అంటే నిబద్ధత కాదు. కొందరు మగవారు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏవేవో ఆశిస్తారు. నాకు తెలిసిన ఒక మహిళా సంగీత దర్శకురాలు ఈ లైంగిక వేధింపులు భరించలేక పరిశ్రమనే వదిలేసి వెళ్లారు. ఇలా మహిళల్ని వేధించేవారు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ప్రముఖ గాయకుడు అయితే మహిళలను కేవలం తన కోర్కెలు తీర్చే వారిగానే భావిస్తారు.

చిరంజీవి గారి తరంలో ఈ కాస్టింగ్‌ కౌచ్‌ సమస్య లేదు. ఆయన ఒక లెజెండ్‌. ఆ తరంలోని నటీనటులంతా ఈ సమస్య లేకుండా అందరూ కలసి కుటుంబ సభ్యుల్లా మెలిగే వారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే వారు. ఎంతో మంది దిగ్గజాలతో కలసి పనిచేసిన వారంతా లెజెండ్సే. ‘మీ టూ’ ఉద్యమాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. సీనియర్‌ నటి షావుకారు జానకి గారు, ‘మీ టూ’ ఉద్యమం సమయంలో నోరు విప్పి మాట్లాడిన బాధితులను ఓ ఇంటర్వ్యూలో అవమానించడం కలచి వేసింది.

పరిశ్రమలో ఈ పరిస్థితులు అన్నీ తెలిసిన కొందరు అమ్మాయిలు విదేశాల్లోంచే వర్క్‌ చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడ ఆడవారికి పని కావాలంటే దానికి బదులుగా శరీరం అప్పగించాలని కోరుకునే మగవారే ఎక్కువ ఉన్నారు. నేను గురువుగా భావించి ఎంతో గౌరవించిన ఓ సీనియర్‌ గీత రచయిత నా తల్లి ముందే నన్ను లైంగికంగా వేధించారు’ అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఇప్పుడు చిన్మ‌యి వ్యాఖ్య‌ల‌పై కొంత‌మంది సానుకూలంగా స్పందించినా చిరంజీవి ఫ్యాన్స్‌, నెటిజ‌న్ల నుంచి తీవ్ర‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Updated Date - Jan 28 , 2026 | 09:08 AM