Chandrahaas: అస‌లు చంద్ర‌హాస్ పాడింది.. మా పాట‌లో లేదు!

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:27 PM

యువ నటుడు చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తే' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన పాట వివాదాస్పదమైంది. అతనిపై జర్నలిస్ట్ అశోక్ పోలీసు కేసు పెట్టారు. ఆ చిత్ర దర్శక నిర్మాతలు చంద్రహాస్ తీరు పట్ల విచారం వ్యక్తం చేశారు.

Baraabar Premistha Movie

ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ 'Chandrahass) 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన బూతు పాటపై నెటిజన్స్ తో పాటు సినిమా రంగానికి చెందిన వారు సైతం నిరసన వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు జేడీ చక్రవర్తి కూడా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వేదిక మీద చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడే కార్యక్రమం నుండి లేచి వచ్చేయాల్సిందని, కానీ నిర్వాహకుల కోరిక మేరకు తాను రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నాడు.


ఇదిలా ఉంటే మరో ఇరవై నాలుగు గంటల్లో సినిమా విడుదల కాబోతుండగా సోషల్ మీడియాలో చెలరేగిన ఈ వివాదంతో చిత్ర నిర్మాత చిన్ని, దర్శకుడు సంపత్ రుద్ర ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో వారు సోషల్ మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. 'ఈ కార్యక్రమంలో హీరో చంద్రహాస్ తన పాత్రను గురించి చెప్పే క్రమంలో ఓ పాట పాడాడని, అయితే అతను ఆ పాట పాడుతున్న విషయం కానీ, అందులో ఉన్న పదాలను గురించి గానీ అక్కడ ఉన్న వారెవరికీ తెలియదని, చంద్రహాస్ చేసిన దానికి తాము బాధపడతున్నామ'ని చెప్పారు. అలానే దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ, 'చంద్రహాస్ పాడిన పాటలోని పదాలేవీ సినిమాలో ఉండవని, ఇది క్లీన్ మూవీ అని, చంద్రహాస్ అలా పాట పాడినందుకు విచారాన్ని తెలియచేస్తున్నామ'ని అన్నారు.


ఇదిలా ఉంటే చంద్రహాస్ తనను బెదిరిస్తూ చేసిన వీడియోపై జర్నలిస్ట్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలోనూ పలువురు ప్రముఖులు చంద్రహాస్ చర్యను నిరసిస్తూ పోస్టులు పెట్టారు. అయితే... వాటిని లెక్కలోకి తీసుకోకుండా చంద్రహాస్ తన చర్యలను సమర్థించుకోవడాన్ని వారు మరింత తీవ్రంగా తీసుకున్నారు. మరి ఈ విమర్శనాస్త్రాల ప్రభావం రేపు విడుదల కాబోతున్న సినిమా మీద పడుతుందేమో చూడాలి.

Updated Date - Feb 05 , 2026 | 04:07 PM